మరో సంప్రదాయాన్నీ పక్కన పెట్టిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంప్రదాయాన్నీ పక్కన పెట్టేస్తున్నారు. అమెరికా అధ్యక్షులైన వారు సాధారణంగా ఓ కుక్క పిల్లను ముద్దుగా పెంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. మరి డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ చేరుకుని ఆరు నెలలు గడిచినా ఇంకా ఓ జంతువును చేరదీయలేదు. గత అధ్యక్షుడు ఒబామా పోర్చుగీసుకు చెందిన వాటర్ డాగ్ బోను పెంచుకున్నారు. నేటి ఆధునిక కాలంలో అధ్యక్షులయ్యే వారిలో దాదాపు అందరూ పెంపుడు జంతువులు కలిగి ఉంటున్నారని పెట్స్ ఎట్ వైట్ హౌస్ పేరుతో ఓ పుస్తకం రచించిన జెన్నిఫర్ పికెన్స్ పేర్కొన్నారు. మరో డొనాల్డ్ ట్రంప్ పెంపుడు జంతువును తెచ్చుకునే ప్రణాళికలపై ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ అధికార ప్రతినిధి స్టీఫెనీ గ్రీషమ్ను మీడియా ప్రశ్నించగా ఇప్పటికైతే ఆ ప్రణాళికలు ఏవీ లేవని, అధ్యక్ష కుటుంబం ఇంకా కొత్త ప్రదేశంలో సర్దుకుపోయే క్రమంలో ఉందని చెప్పారు. ఒకవేళ ట్రంప్ దంపతులు పెంపుడు జంతువు వద్దనుకుంటే కొత్త సంప్రదాయానికి నొంది పలికినట్టే అవుతుంది.













