డిజిటల్ గ్రామంగా దొండపాడు
తెలంగాణలో పుట్టిన ఎన్నారై అప్పిరెడ్డి అన్నపరెడ్డి మాతృరాష్ట్రానికి ఏదైనా చేయాలన్న తపనతో తాను పుట్టిన పల్లెను దత్తత తీసుకుని అభివృద్ధిపరచడంతోపాటు సంపూర్ణ డిజిటల్ విలేజ్‌గా తయారు చేశారు. ఎన్నారైల డ్రీమ్ ప్రాజెక్ట్ డిజిథాన్లో భాగస్వామ్యమై, తన సొంత గ్రామాన్ని డిజిటల్ విలేజ్ గా మార్చారు. తొలి డిజిటల్ గ్రామంగా సూర్యాపేట జిల్లాలోని దొండపాడు రెడీ అయింది. వంద శాతం అక్షరాస్యత గల పల్లెగా మారింది.
డిజిథాన్తో తెలంగాణ పల్లెల్లో సాంకేతిక వెలుగులను ఎన్నారైలు పంచుతున్నారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా), ఎన్నారైలు సంయుక్తంగా గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు. పలు గ్రామాలను దత్తత తీసుకుని వందశాతం డిజిటల్ అక్షరాస్యత గల గ్రామాలుగా మారుస్తున్నారు.
ఇలా తెలంగాణలో తొలి డిజిటల్ గ్రామంగా సూర్యపేట జిల్లాలోని దొండపాడుని తీర్చిదిద్దారు ఎన్నారై అప్పిరెడ్డి అన్నపరెడ్డి. మాతృభూమికి ఆయన చేసిన సేవను ఇతర ఎన్నారైలు కూడా ఆదర్శంగా తీసుకుని తాము పుట్టిన పల్లెలను అభివృద్ధిపరచాలని పలువురు కోరుతున్నారు.








