సిస్కో చేతికి మనోడి కంపెనీ
విప్టెలా అనే నెట్వర్క్ స్టార్టప్ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్టు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం సిస్కో ప్రకటించింది. ఈ స్టార్టప్ కంపెనీని అక్కిరాజు ప్రవీణ్ అనే ప్రవాసాంధ్రుడు అమెరికాలో స్థాపించారు. ఈ కంపెనీ 61 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3,965 కోట్ల) కొనుగోలు చేయనున్నట్టు సిస్కో కంపెనీ తెలిపింది. శాన్‌జోస్ కేంద్రంగా పని చేసే విప్టెలా అనేక ప్రముఖ కంపెనీలకు సాఫ్ట్వేర్ డిఫైన్డ్-వైడ్ ఏరియా నెట్వర్క్ (ఎస్డి-వాన్) సేవలు అందిస్తోంది. మద్రాస్ ఐఐటి నుంచి బిటెక్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన ప్రవీణ్ 2012లో ఈ స్టార్టప్ కంపెనీని ప్రమోట్ చేశారు. తమ నెట్వర్క్ ఎంటర్ప్రైజెస్ వ్యూహానికి మరింత దోహదం చేసే అవకాశం ఉన్నందున విప్టెలా కంపెనీని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు సిస్కో తెలిపింది. ఈ సంవత్సరం చివరికల్లా ఈ కొనుగోలు పూర్తవుతుందని సిస్కో భావిస్తోంది.








