ఉత్తర కొరియాకు వెళ్లొద్దు : అమెరికా
ఉత్తర కొరియాకు వెళ్లొద్దని అమెరికా తన పౌరులను హెచ్చరించింది. ఉత్తరకొరియాలో నాలుగో అమెరికా పౌరుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ఈ హెచ్చరిక జారీ చేసింది. అక్కడకు వెళ్తే అరెస్టు, దీర్ఘకాలిక నిర్బంధం వంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అమెరికాలో నేరంగా పరిగణించని చర్యలను కూడా ఉత్తర కొరియాలో నేరంగా పరిగణిస్తున్నారని తెలిపింది. ఈ ట్రావెల్ వార్నింగ్‌ను కాదని, ఉత్తర కొరియాలోకి ప్రవేశిస్తే, అక్కడ మీకు గోప్యత ఉండబోదని, మీ యుఎస్బి డ్రైవ్‌లు, సిడిలు, డివిడిలు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, లాప్‌టాప్‌లు వంటి వాటినన్నింటినీ తనిఖీ చేస్తారని హెచ్చరించింది. కిమ్ హాక్ సంగ్ దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే అభియోగంపై ఉత్తర కొరియాలో అరెస్టు చేసిన నేపథ్యంలోఈ హెచ్చరిక జారీ చేసింది.








