ప్రతికూల ఆంశాలతోనే దూరం
చైనా, అమెరికా సంబంధాలు కొన్ని ప్రతికూల అంశాల కారణంగా దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఇద్దరు నాయకులు ఫోన్లో సంభాషించుకున్నారు. ఇటీవల కొంతకాలంగా అమెరికా వరుసగా తీసుకున్న కొన్ని చర్యలు చైనాకు ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతల తర్వాత జరిగిన చర్చలివి. ఏప్రిల్ తాను ట్రంప్‌తో సమావేశం అయిన తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో కీలకమైన ఫలితాలు చోటు చేసుకొన్నాయని జీ అన్నారు. అయితే అదే సందర్భంలో కొన్ని విరుద్ధ పరిణామాలు సంభవించి సంబంధాలు దెబ్బతిన్నాయని కూడా జీ ఆ సంభాషణలో పేర్కొన్నారు. ఒకటే చైనా సూత్రానికి అమెరికా కట్టుబడి ఉందని ట్రంప్ ఇచ్చిన హామీ పట్ల జీ సంతోషం ప్రకటించారు. ఆ ప్రకటనకు తమ దేశం అత్యధిక ప్రాముఖ్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఆ సూత్రానికి అనుగుణంగా తైవాన్ పట్ల అమెరికా నడుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.








