14 ఏళ్ల లోపు పిల్లలు భద్రంగా రోడ్డు దాటలేరు!
పద్నాలుగేళ్లలోపు పిల్లలకు భద్రంగా రోడ్డు దాటేంతటి పరిపక్వత ఉండదని తాజా అధ్యయనం వెల్లడించింది. కాస్త రద్దీగా ఉన్న రోడ్డును దాటాలన్నా ఒత్తిడి వల్ల తడబడతారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లోవా పరిశోధకులు కంప్యూటర్ సిమిలేషన్ ద్వారా రోడ్డుపై వర్చువల్గా వాహనాలను సృష్టించి అధ్యయనం చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కార్ల మధ్య 6, 8, 10, 12, 14, ఆ పై వయసున్న పిల్లలను రోడ్డు దాటాలని సూచించారు. ఆరేళ్ల పిల్లలు 8 శాతం, ఎనిమిదేళ్ల పిల్లలు 6శాతం, పదేళ్ల పిల్లలు 5శాతం, 12 ఏళ్ల పిల్లలు 2శాతం సమయాల్లో కార్ల మధ్య ఆగిపోయి ప్రమాదాల బారినపడ్డారు. పిల్లలు వారి నుంచి కారు ఉన్న దూరాన్ని దాని వేగాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 14 ఏళ్ల, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వారు మాత్రం ఏ తడబాటు లేకుండా రోడ్డు దాటగలుగుతున్నారని చెప్పారు.













