ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేస్తాం : గూగుల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలసి పనిచేయడానికి అమెరికాకి చెందిన గూగుల్ ఎక్స్ సంస్థ అంగీకారం తెలిపింది. గూగుల్ డ్రైవర్ లెస్ కారు, గూగుల్ గ్లాసెస్ తదితర ఆవిష్కరణలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గూగుల్ ఎక్స్ ఆంధ్రప్రదేశ్‌తో కలిసి అడుగులు వేసేందుకు అంగీకరించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం కాలిఫోర్నియాలోని మౌంటెయిన్ వ్యూ ప్రాంతంలో ఉన్న గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని సందర్శించింది. ఎన్నో గూగుల్ ఆవిష్కరణలకు కేంద్రమైన ఈ ప్రదేశం అత్యంత గోప్యమైంది. ఇక్కడికి చాలా తక్కువమందికే అనుమతి ఉంటుంది. గూగుల్ ఎక్స్ సీఈవో అస్ట్రో టెల్లర్ తమ ఆవిష్కరణలు, పరిశోధనలపై ముఖ్యమంత్రికి ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ తరహా ఆవిష్కరణలకు, వినూత్న ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదికగా మలచుకోవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ వ్యాప్తికి సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.













