అమెరికాలో మోడీ జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరణ
భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ హోదాలో సాధించిన పురోగతిపై జులైలో భారత్‌లో వెలువడిన ది మేకింగ్ ఆఫ్ ఏ లెజెండ్ పుస్తకాన్ని అంతర్జాతీయ స్థాయిలో వాషింగ్టన్లో విడుదల చేశారు. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ రచించిన ఈ పుస్తక ప్రతుల్ని అబీ బెరా తదితర అమెరికా సెనేటర్లుకు అందజేశారు. ప్రధానిగా మోదీ చేస్తున్న కృషిని వారంతా కొనియాడారు. మోదీ అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన నిజమైన ప్రజానేత అనీ, ఆయన నేతృత్వంలో భారతదేశం 2019 నాటికి 100 శాతం పారిశుద్ధ్యాన్ని సాధించి తీరుతుందని పాఠక్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ అభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి నిజమైన, సమర్థమైన మార్గదర్శకుడు మోదీయే నని చెప్పారు. విదేశాల్లోని బీజేపీ మిత్రులు విభాగానికి చెందిన అడపా ప్రసాద్‌తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








