నోబెల్ అందుకున్న బాబ్ డిలాన్
అమెరికా గాయకుడు, సినీ గేయ రచయిత, స్వరకర్త బాబ్ డిలాన్ ఎట్టకేలకు నోబెల్ బహుమతిని స్వీకరించారు. గత ఏడాది అక్టోబర్‌లో గేయ రచయిత డిలాన్‌కు సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించగా పురస్కార ప్రదానోత్సవానికి ఆయన వచ్చేదీరానిది చెప్పకుండా అప్పట్లో ప్రపంచాన్ని సప్పెన్స్లో ఉంచిన విషయం తెలిసిందే. స్టాక్‌హోంలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో డిలాన్‌కు నోబెల్ బహుమతిని అందజేశాం. ఈ కార్యక్రమానికి కేవలం 12 మంది అకాడమీ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు అని అకాడమీ శాశ్వత కార్యదర్శి ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించారు. ప్రతిష్టాత్మకమైన సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందిన తొలి సినీ గేయ రచయితగా బాబ్ డిలాన్ నిలిచారు. నోబెల్ బహుమతితోపాటు ఇచ్చే 8,37,000 యూరోల (భారత కరెన్సీ ప్రకారం రూ.5,78,45,070) నగదు బహుమతిని పొందాలంటే పురస్కార ప్రదాన కార్యక్రమంలో కచ్చితంగా నోబెల్ సంప్రదాయక ప్రసంగం చేయాల్సి ఉంటుంది. కానీ, గతంలో పురస్కార ప్రదాన కార్యక్రమానికి బాబ్ డిలాన్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో జూన్ 10వ తేదీలోపు ఆయన చిన్న సందేశాన్ని ఇవ్వాలి. అది వీడియో, పాట రూపంలోనైనా ఉండవచ్చు. లేకపోతే డిలాన్ నగదు బహుతిని కోల్పోవాల్సి ఉంటుంది.













