బిల్‌గేట్స్ మరో సారి భూరి విరాళం
ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి భూరి విరాళం ఇచ్చారు. తన వ్యక్తి గత చారిటీ సంస్థ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌కు 460 కోట్ల డాలర్ల( దాదాపు రూ.29,500 కోట్లు) విలువైన 6.4 కోట్ల మైక్రోసాఫ్ట్ షేర్లను జూన్ 6న దానం చేశారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్‌ల ద్వారా ఈ విషయం వెల్లడైంది. 1999లో బిల్‌గేట్స్ ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. అప్పుడు 1,600 కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు. తర్వాత ఏడాదిలో (2000 సంవత్సరంలో) మరో 510 కోట్ల డాలర్లు దానం చేశారు. ఆ తర్వాత బిల్ అండ్ మిలిండా గేట్స్‌కు ఇచ్చిన అతి పెద్ద విరాళం ఇదే. ఇప్పటివరకు బిల్‌గేట్స్ 5వేల కోట్ల డాలర్లకు పైగా విరాళాలు ఇచ్చారు. తాజా విరాళం తర్వాత మైక్రోసాఫ్ట్‌లో బిల్‌గేట్స్ వాటా 2.3 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది.








