ట్రంప్‌ది క్రూరమైన చర్య
చిన్నప్పుడే తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న యువత (డ్రీమర్స్)ను అక్రమ వలసదారులుగా గుర్తించడాన్ని మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్- డీఏసీఏ) వర్క్ పర్మిట్లను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేయడాన్ని క్రూరమైన నిర్ణయమని విమర్శించారు. డ్రీమర్స్ ఆశలు గల్లంతు చేస్తూ ఫైలుపై ట్రంప్ సంతకం చేయగా, అదేరోజు ట్రంప్ చర్యను ఒబామా తప్పుపట్టారు. వలసదారుల వల్ల అమెరికా పొంచి వున్న ప్రమాదమేమీ లేదని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. పేరెంట్స్ అమెరికాకు రావడమే డ్రీమర్స్ చేసిన తప్పిదం కాదని, దేశ ఆర్థిక వ్వవస్థకు ఊతమిచ్చే యువతపై ఆంక్షలు విధించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.








