ATA: డెలావేర్ వ్యాలీలో ఘనంగా ఆటా మహిళా దినోత్సవ వేడుకలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో డెలావేర్ వ్యాలీలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మార్చి 28న జరిగిన ఈ వేడుకలో సుమారు 300 మంది మహిళలు పాల్గొని, రంగురంగుల సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్పీకర్ సెషన్స్ మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
జేపీ మోర్గాన్ చేజ్ మేనేజింగ్ డైరెక్టర్ శిరీష మలెంపాటి మాట్లాడుతూ.. టెక్నాలజీ రంగంలో మహిళలు ఎదుగుతున్న తీరును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతను వివరించారు. టీడీ బ్యాంక్ పోర్ట్‌ఫోలియో హెడ్ శృతి మెడిశెట్టి మహిళలకు ఆర్థిక క్రమశిక్షణ, పొదుపుపై అవగాహన కల్పించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా ఈ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలను చక్కగా నిర్వహించిన మహిళా కోఆర్డినేటర్ల కృషిని అభినందించారు. ఇదే ఏడాది వేసవిలో బాల్టిమోర్‌లో జరగనున్న ఆటా మహాసభలకు తెలుగు వారందరూ తరలిరావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
అలరించిన సాంస్కృతిక వేడుకలు
ఈ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన విభిన్న కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కామేశ్వరి బృందం జానపద నృత్యాలతో కార్యక్రమం ప్రారంభం కాగా, అలేఖ్య టీమ్ ప్రదర్శించిన సమూహ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్వేత పిన్న నేతృత్వంలో నిర్వహించిన ఫ్యాషన్ షో వేదికపై కొత్త వెలుగులు నింపింది.
ఈ వేడుకలో ఏటీఏ నేతలు పరమేష్ భీంరెడ్డి, రాజ్ కక్కెర్ల, కిరణ్ ఆల సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రుచికరమైన విందు, సంగీత విభావరితో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.









