ఇర్మా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆటా ముందస్తు సహాయ సహకారాలు
ప్రకృతి విపత్తుల్లో, ప్రమాద సమాయాల్లో తమ వంతు సేవలు, సహాయ సహకరాలు అందించే ఆటా(అమెరికా తెలుగు అసోసియేషన్) మరోసారి నడుం కట్టింది. ఇర్మా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో ఫ్లోరిడా, జార్జియ, అలబామా, ఇతర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను బారిన పడేవారికి ముందస్తు సహాయ సహకారాలు అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వేలమంది ఈ తుఫాను ప్రమాదంలో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తాము స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు ముందుకొస్తామంటూ ప్రకటించింది. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు సూచనలు చేసింది.
సహాయం కావాలనుకునే వారు రెండు మార్గాల్లో తమను అనుసరించవచ్చని ప్రకటించింది. ఒక ప్రత్యేక డేటాతో కూడిన ఫాం అందిస్తూ అందులో వివరాలు అందించడం ద్వారా తగిన ఏర్పాట్లు చేసే అవకాశం ఇవ్వడంతోపాటు ప్రత్యేకంగా 844-282-7382(844-ఏటీఏ-సేవా) అనే సంప్రదించాల్సిన నెంబర్ తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు సరిపడిన వస్తువులు, బ్లాంకెట్/కనీస వస్త్రాలు కూడా అందజేస్తామని తెలిపింది. ఈ సందర్భంగా కొన్ని ఇండియన్ రెస్టారెంట్లు (టేస్ట్ ఆఫ్ ఇండియా, కాకతీయ ఇండియన్ రెస్టారెంట్, శ్రీ కృష్ణ విలాస్ తదితరమైనవి) ఆహారం సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయని, అందుకు కృతజ్ఞతలని కూడా ప్రకటించింది. ఇప్పటికే 200 కుటుంబాలకు చేయుతనందించింది. వారికి అట్లాంటాలోని హిందూ దేవాలయాల్లో పునరావాసం కల్పించి అవసరమైన ఏర్పాట్లు చేసింది.













