ఫ్లోరిడాలో ఓ అరుదైన ఘటన!
అమెరికా ఫ్లోరిడాలోని పనామా సిటీ బీచ్లో మానవత్వం పరిమళించే ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కళ్లముందే ఓ కుటుంబం నీళ్లలో కొట్టుకుపోవడాన్ని చూసిన ప్రజలు దాదాపు 80 మంది మానవహారంలా ఏర్పడి వారిని కాపాడారు. వివరాల్లోకెళితే రాబెర్టా ఉర్స్ రే అనే మహిళ పనామా సిటీ బీచ్లో బోట్ నడుపుతుండగా అది నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో రే కుటుంబానికి చెందిన అరుగురితో పాటు మరో నలుగురు సముద్రంలో చిక్కుకున్నారు. బలమైన అలల తాకిడికి సముద్రం లోపలకు కొట్టుకుపోతూ హెల్ప్ హెల్ప్ అంటూ అరిచారు. బాధితుల అరుపులను విన్న జెస్సికా, డెరెక్ సిమన్స్ అనే దంపతులు వారిని కాపాడేందుకు సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్లారు. వీరిని గమనించిన మరికొంత మంది ఈత రాకపోయినా సాయం కోసం ముందుకు వచ్చారు. ఇలా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని దాదాపు 80 మంది మానవహారంలా ఏర్పడ్డారు. దాదాపు గంట పాటు శ్రమించి మొత్తం 10 మందిని రక్షించి తీరానికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గుండెపోటుకు గురైన 67 ఏళ్ల మహిళను అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఉర్స్రే మీడియాతో మాట్లాడుతూ జెస్సికాకే లేకపోతే ఈ రోజు తామంతా బతికే వాళ్లం కాదని అన్నారు.













