డీఏసీఏపై ఫెడరల్ కోర్టును ఆశ్రయించిన 15 రాష్ట్రాలు
డీఏసీఏ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడుట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతోపాటు 15 రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో కేసు వేశాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులతోపాటు అక్రమంగా అమెరికా వచ్చి, అనుమతులు లేకుండా అక్కడ నివసిస్తున్న యువతను డ్రీమర్లు అని పిలుస్తారు.
వీరు అమెరికాలో ఉండేందుకు, పనిచేసేందుకు అనుమతులిస్తూ ఒబామా హయాంలో డీఏసీఏ కార్యక్రమాన్ని తీసుకురాగా ట్రంప్ రద్దు చేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగబద్ధం కాదనీ, ఉత్తర్వులను కొట్టేయాలని రాష్ట్రాలు కోర్టును కోరాయి. మెక్సికన్లు, లాటిన్లు తదితరులపై వ్యక్తిగత ద్వేషంతోనే ట్రంప్ డీఏసీఏను రద్దు చేశారన్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్, మసాచుసెట్స్, కనటికట్, డెలావర్, హవాయ్, ఇల్లినాయిస్ తదితర రాష్ట్రాలు కోర్టులో పిటిషన్ వేశాయి.













