ట్రంప్ తీరును తప్పుపడుతున్న గవర్నర్
వలసలు హెచ్1బీ వీసాలపై ఇన్నాళ్లు ప్రపంచం గగ్గోలు పెట్టాగా ట్రంప్ తాజా నిర్ణయంతో ఇప్పుడు అమెరికన్లు మండిపడుతున్నారు. ఏకంగా గవర్నర్ స్థాయి వ్యక్తులు సైతం ట్రంప్ తీరును తప్పుపడుతున్నారు. గత ఒబామా సర్కారు ‘బొగ్గుపై యుద్ధం’ పేరుతో అమలు చేసిన స్వచ్ఛ విద్యుత్ చట్టాన్ని (క్లీన్ పవర్ ప్లాన్) అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయటంపై పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒబామా ప్రభుత్వం గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను తన ప్రభుత్వం రద్దు చేస్తోందని ట్రంప్ ప్రకటించారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు గ్యాస్ ఆధారితంగా మారిపోవటంతో అప్పట్లో కొన్ని బొగ్గు గనులు మూతపడి అనేక మంది ఉపాధి కోల్పోయారని ఆయన వివరించారు. ఇందుకు సంబంధించిన ఇతర నిబంధనలను కూడా రద్దు చేస్తామని అయితే స్వచ్ఛమైన గాలి నీరు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఈ చర్యలను అమలు చేస్తామని ట్రంప్ చెప్పారు. అమెరికా విద్యుత్ రంగంపై కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేసే చారిత్రక నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకున్నదని ఉద్యోగావకాశాలను హరించే చట్ట నిబంధనలను రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. స్వచ్ఛ విద్యుత్ ను కాదనటం తప్పు అని ఇది శాస్త్ర విజ్ఞానాన్ని ధిక్కరించటమే అవుతుందని కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్ వ్యాఖ్యానించారు. ప్రకృతి వనరుల పరిరక్షణా మండలి డైరెక్టర్ డేవిడ్ గోల్డ్‌స్టోన్ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణానికి తూట్లు పొడిచేందుకు ప్రజలు ట్రంప్‌ను ఎన్నుకోలేదన్నారు. ఇప్పుడు చేపట్టిన మార్పులు చట్టానికి శాస్త్ర పరిజ్ఞానానికి అనుకూలంగా ఉన్నాయని నిరూపించాలని ఆయన ట్రంప్ ప్రభుత్వానికి సవాలు విసిరారు.













