అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
అమెరికా మరోసారి కాల్పులతో ఉలిక్కిపడింది. శనివారం అర్థరాత్రి దాటాక సిన్సినాటిలోని కామియో నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల్లో ఒబ్రయాన్ స్పైక్స్ (27) అనే యువకుడు మృతి చెందాడు. మరో 15 మందికి తూటాగాయాలయ్యాయి. గాయపడినవారికి ప్రాథమిక చికిత్స చేసి సమీప ఆస్పత్రులకు తరలించారు. వారిలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకరికంటే ఎక్కువ మందే కాల్పులు జరిపినట్లు వారు చెబుతున్నారు. ఇది ఉగ్రదాడి అయి ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. ఎందుకంటే కాల్పులు జరగడానికి పది నిమిషాల ముందు డీజె సెక్యూరిటీ సిబ్బందిని పిలిచినట్లు తెలుస్తోంది. క్లబ్లో కొందరి మధ్య జరిగిన ఘర్షణ క్రమంగా ముదిరి కాల్పులకు దారితీసి ఉంటుందని, అందుకే కాల్పులు జరగగానే అక్కడున్నవారిలో చాలామంది హడావుడిగా బయటకు వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. తూటాగాయాలపాలైనవారిని, ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఆ సమయంలో అక్కడున్నవారు ఎవరైనా, తమకు తెలిసిన వివరాలు తెలపాల్సిందిగా కోరుతున్నారు.













