రణబాలితో డైరెక్టర్ గా రాహుల్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్తారా?
విజయ్ దేవరకొండ(vijay devarakonda), రష్మిక మందన్నా(rashmika mandanna) జంటగా నటించిన రణబాలి(ranabaali) ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రాహుల్ సాంకృత్యన్(rahul sankrityan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆసక్తి మరింత పెరిగింది. స్వాతంత్య్రానికి ముందు రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ పాలకులు సాగించిన అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే, హిస్టారికల్ అంశాలను స్క్రీన్‌పై ఎంత స్ట్రాంగ్ గా ఆవిష్కరిస్తారు? ఆడియన్స్ ను ఎమోషనల్ గా ఎంతవరకు కనెక్ట్ చేస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రాహుల్ గత సినిమా శ్యామ్ సింగరాయ్(Shyam singharoy) ఆయనలోని మరో యాంగిల్ ను ఆడియన్స్ కు పరిచయం చేసింది. సమకాలీన కథతోపాటు గత కాలానికి సంబంధించిన సీన్స్ ను మేళవించిన విధానం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా దేవదాసీ వ్యవస్థలోని దోపిడీ, మహిళలపై జరిగిన అన్యాయాలను ఆయన తెరకెక్కించిన తీరు ప్రశంసలు అందుకుంది. నాని(nani) యాక్టింగ్ కూడా ఆ కథకు బలాన్నిచ్చింది. పీరియడ్ నేపథ్యాన్ని సమర్థంగా నిర్వహించగల డైరెక్టర్ గా రాహుల్‌పై ప్రేక్షకుల్లో నమ్మకం ఏర్పడటానికి ఆ సినిమా ఒక కారణమైంది.
ఇప్పుడు రణబాలితో అంతకుమించిన బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. చారిత్రక నేపథ్యానికి విజయ్ దేవరకొండ యాక్టింగ్, రాహుల్ కథన శైలి తోడైతే సినిమా కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది. అయితే, భారీ అంచనాలను అందుకోవాలంటే కేవలం నేపథ్యం మాత్రమే సరిపోదు. కథలోని ఎమోషన్స్, క్యారెక్టర్ డిజైన్, టెక్నికల్ క్వాలిటీ కూడా కీలకం. ఈ అంశాలన్నింటిలో సినిమా మెప్పిస్తే రాహుల్ సాంకృత్యన్ కెరీర్లో రణబాలి కీలక మైలురాయిగా నిలవడమే కాకుండా, ఆయనను నెక్ట్స్ లెవెల్ డైరెక్టర్ గా నిలబెట్టే అవకాశం ఉంది.








