అందుకే సంబరాల ఏటిగట్టు వదులుకున్నా!
కిరణ్ అబ్బవరం(kiran abbavaram) నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ(Chennai lovestory) రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో ఆయన ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) హీరోగా రూపొందుతున్న సంబరాల ఏటిగట్టు సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డైరెక్టర్ రోహిత్(Rohit) మొదట ఈ ప్రాజెక్ట్‌ను తనకే వినిపించాడని, మొదట్లో అది చిన్న స్థాయి కథగా ఉండేదని కిరణ్ చెప్పారు. అయితే డైరెక్టర్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించి మరింత భారీ కథతో రావాలని సూచించానని, ఆ తర్వాతే ఈ కథ రూపుదిద్దుకుందని ఆయన వివరించారు. నిర్మాత నిరంజన్(Niranjan)తో కలిసి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కూడా అప్పట్లో జరిగినట్లు చెప్పారు.
అయితే ప్రీ ప్రొడక్షన్ దశలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని కిరణ్ వెల్లడించారు. తన వరుస సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, అదే సమయంలో ప్రాజెక్ట్ బడ్జెట్ భారీగా పెరగడం వల్ల ఈ సినిమా తన మార్కెట్‌కు మించి రిస్క్ అవుతుందని భావించానని చెప్పారు. నిర్మాత ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, తన ప్రస్తుత మార్కెట్ దృష్ట్యా అంత పెద్ద బాధ్యత తీసుకోవడం సరైంది కాదని భావించి తానే తప్పుకున్నానని వెల్లడించారు. నిర్మాత ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమే అది అని ఆయన స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ సాయి ధరమ్ తేజ్ చేతికి వెళ్లడం తనకు ఆనందమే కలిగించిందని కిరణ్ పేర్కొన్నారు. డైరెక్టర్ టాలెంట్ పై తనకు మొదటి నుంచే నమ్మకం ఉందని, అందుకే అతను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రోత్సహించానని తెలిపారు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తే తనకూ ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) నటిస్తుండగా, భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.








