స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్.. 2028లో వంగా–రణ్‌బీర్ కాంబో?
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ప్రస్తుతం ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న స్పిరిట్(Spirit)పై పూర్తి దృష్టి పెట్టారు. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌ను అక్టోబర్‌లో తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, తన తర్వాతి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాలని వంగా భావిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని విభిన్నమైన పాత్రలో చూపించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ నెలకొంది.
స్పిరిట్ తర్వాత వంగా చేయబోయే సినిమా విషయంలోనూ ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)తో ఆయన రూపొందించిన యానిమల్(Animal) కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న యానిమల్ పార్క్(Animal Park) నే తదుపరి ప్రాజెక్ట్‌గా తీసుకెళ్లనున్నట్లు సమాచారం. నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా(Pranay Reddy Vanga) వెల్లడించిన వివరాల ప్రకారం.. స్పిరిట్ రిలీజైన సుమారు ఆరు నెలల తర్వాత యానిమల్ పార్క్‌ను ప్రారంభించే ఆలోచనలో వంగా ఉన్నారు.
అదే టైమ్‌లైన్ కొనసాగితే 2027 చివరి నాటికి యానిమల్ పార్క్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. నిర్మాణ కార్యక్రమాలు, షూటింగ్ వేగం, పోస్ట్ ప్రొడక్షన్ వంటి అంశాలను బట్టి 2028లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. దీంతో వంగా కెరీర్లో స్పిరిట్ తర్వాత మరో భారీ ప్రాజెక్ట్ సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది.
రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌కు యానిమల్ తో వచ్చిన క్రేజ్ నేపథ్యంలో సీక్వెల్‌పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. టీ సిరీస్(T Series), భద్రకాళి పిక్చర్స్(Badrakali Pictures) సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన కథ, ఇతర నటీనటులు, షూటింగ్ షెడ్యూల్‌పై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం స్పిరిట్ వర్క్‌నే ప్రాధాన్యతగా తీసుకున్న వంగా.. ఆ తర్వాత యానిమల్ పార్క్ తో మరోసారి భారీ సంచలనానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.








