24 టైటిల్ ముందు తనేదనంటున్న నాని
నేచురల్ స్టార్ నాని(nani) కెరీర్‌ను గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తుంది. ఈరోజు హీరోగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన.. అసలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాత్రం హీరోగా ఎదగాలనే ఉద్దేశంతో కాదు. డైరెక్టర్ గా మారాలన్న కోరికతోనే ఇండస్ట్రీలోకి వచ్చిన నాని, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ సినిమా మేకింగ్‌పై అవగాహన పెంచుకున్నాడు. లెజెండరీ డైరెక్టర్ బాపు(bapu) తెరకెక్కించిన రాధాగోపాలం(radha gopalam) సినిమాకు ఆయన అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ టైమ్ లోనే ఫ్యూచర్ లో తానే డైరెక్టర్ గా ఓ సినిమా చేయాలనే ఆలోచనతో ఒక కథను రెడీ చేసుకున్నాడట.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. నాని డైరెక్టర్ గా చేయాలనుకున్న ఆ మొదటి సినిమా కోసం బౌండ్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడట. కేవలం 18 ఏళ్ల వయసులో రాసుకున్న ఆ కథ యాక్షన్ జానర్‌కు చెందినదని నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ సినిమాకు 24 అనే టైటిల్ కూడా పెట్టుకున్నట్లు చెప్పాడు. అప్పటికి సూర్య(suriya) నటించిన 24 సినిమా రాలేదని, తన కథకే ముందుగా ఆ పేరు పెట్టుకున్నానని సరదాగా గుర్తుచేసుకున్నాడు. ఇన్నేళ్లు గడిచినా ఆ కథలో ఇప్పటికీ సినిమా అయ్యే మెటీరియల్ ఉందని నాని అభిప్రాయపడ్డాడు.
అయితే కాలం మారడంతో కథను కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుందని నాని చెప్పాడు. తన చేతిలో ఉంటే తానే ఆ సినిమాను తెరకెక్కించేవాడా అనే ప్రశ్నకు మాత్రం.. ఇప్పుడు తన జర్నీ పూర్తిగా మారిపోయిందని స్పష్టం చేశాడు. నటుడిగా బిజీ అయిపోయిన తర్వాత డైరెక్షన్ తన చేతుల్లో లేకుండా పోయిందన్నట్టుగా నాని మాట్లాడాడు. దీంతో నాని దగ్గర దాదాపు ఇరవై ఏళ్ల క్రితం సిద్ధమైన ఆ యాక్షన్ స్క్రిప్ట్ ఇప్పుడు మరో డైరెక్టర్ చేతిలో పడితే ఎలా ఉంటుందనే ఆసక్తి మొదలైంది. ఫ్యూచర్ లో ఆ కథకు మరోసారి ప్రాణం పోసే ప్రయత్నం జరుగుతుందేమో చూడాలి.








