రామాయణ సెట్‌కు మంటలు.. అసలు జరిగిందేంటంటే?
ముంబై ఫిల్మ్ సిటీలో సోమవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం బాలీవుడ్లో ఒక్కసారిగా కలకలం రేపింది. రణ్‌బీర్ కపూర్(ranbir kapoor), సాయి పల్లవి(Sai pallavi) జంటగా నటిస్తున్న రామాయణ(ramayana) షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటనపై తాజాగా అందుతున్న వివరాలు ఆ ప్రచారానికి భిన్నంగా ఉన్నాయి. ఫిల్మ్ సిటీలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియో వెనుక భాగంలో ఏర్పాటు చేసిన టెంపరరీ ప్రొడక్షన్ లోనే మంటలు చెలరేగినట్లు సమాచారం.
ముంబై ఫైర్ బ్రిగేడ్ ఈ ఘటనను లెవల్1 ఫైర్‌గా నమోదు చేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 4 గంటల సమయంలో మంటలు గుర్తించగా, సుమారు గంటలోపే అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ వైర్లు, కేబుల్స్, చెక్క సామగ్రి, ఏసీ యూనిట్, వెదురు, ప్లాస్టిక్ వస్తువులతో పాటు కొంత షూటింగ్ సామగ్రి దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే ప్రమాద తీవ్రత పెద్దగా లేదని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బి.ఎన్. తివారీ(BN Tiwari) కూడా ఘటనను ధృవీకరించారు.
ఇదిలా ఉంటే రామాయణ మేకర్స్ మాత్రం తమ అసలు షూటింగ్ సెట్‌కు ఈ అగ్ని ప్రమాదంతో సంబంధం లేదని చెప్తోంది. వైరలవుతున్న విజువల్స్ సినిమా మెయిన్ సెట్‌కు సంబంధించినవి కావని మేకర్స్ చెప్తున్నారు. దీంతో మొదట వచ్చిన ప్రచారంపై క్లారిటీ వచ్చినట్లైంది. నితేశ్ తివారీ(nitesh tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్(yash) రావణుడిగా, సన్నీ డియోల్(Sunny deoal) హనుమంతుడిగా కనిపించనున్నారు. రామాయణ ఫస్ట్ పార్ట్ రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్(Ramayana: rise of a legend) నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.








