నా కెరీర్లో చేసిన ఆల్ఫా పని అదే!
స్టార్ హీరోగా అల్లు అర్జున్(allu arjun)కు ఉన్న క్రేజ్ పుష్ప(Pushpa) ఫ్రాంచైజ్‌తో మరింత అంతర్జాతీయ స్థాయికి చేరింది. తాజాగా ఫోర్బ్స్ ఇండియా(Forbes India)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్, సినిమాలపై అంచనాలు, బాక్సాఫీస్ ఒత్తిడి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలోని ముఖ్యమైన అంశాలను బన్నీ(Bunny) సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి ఇప్పుడు అభిమానులు, సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా నేటి ఆడియన్స్ సినిమాను స్వీకరించే విధానంపై ఆయన చేసిన కామెంట్స్ ప్రత్యేకంగా నిలిచాయి.
పుష్ప 2: ది రూల్(Pushpa2: The Rule) సినిమాలో గంగమ్మ తల్లి జాతర నేపథ్యంలో అల్లు అర్జున్(Allu Arjun) కనిపించిన ప్రత్యేక రూపం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. చీరకట్టుతో, లేడీ గెటప్ లో బన్నీ చేసిన ఆ సీన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈ పాత్ర గురించి ప్రస్తావిస్తూ.. తన కెరీర్లో తాను చేసిన అత్యంత ఆల్ఫా పనుల్లో ఇదొకటని బన్నీ పేర్కొన్నారు. స్టార్ ఇమేజ్‌కు భిన్నంగా కనిపించేందుకు సిద్ధపడటమే తన దృష్టిలో అసలైన ధైర్యానికి నిదర్శనమనే భావనను ఆయన వ్యక్తం చేశారు.
ఇక భారీ సినిమాలతో వచ్చే ఒత్తిడిని తాను ప్రతికూలంగా చూడనని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రేక్షకుల అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ దక్కదని, అలాంటి స్థాయికి చేరుకున్నప్పుడు ఒత్తిడి కూడా ఒక ప్రత్యేకమైన అవకాశంగానే భావించాలని చెప్పారు. తనపై పెరుగుతున్న అంచనాలను భారంగా కాకుండా మరింత మెరుగైన పని చేయడానికి ఉపయోగపడే ప్రేరణగా తీసుకుంటాననే సంకేతాలను ఆయన ఇచ్చారు.
మరోవైపు ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పుపైనా బన్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సాధారణ స్థాయి కంటెంట్‌తో సినిమాను నిలబెట్టడం కష్టమని, ఆడియన్స్ నాణ్యమైన కంటెంట్ విషయంలో చాలా స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా నిజంగా గొప్పగా ఉంటే దాని ప్రభావం బాక్సాఫీస్ వద్ద సహజంగానే కనిపిస్తుందని పేర్కొన్నారు. పుష్ప సక్సెస్‌తో భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందేలా చేయాలన్న తన టార్గెట్ మరింత బలపడిందని అల్లు అర్జున్ చెప్పడం గమనార్హం.








