డ్యాన్సర్ అసోసియేషన్ లో కీలక పరిణామం.. రఘు మాస్టర్ కు భారీ మద్దతు
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. అసోసియేషన్‌లోని తాజా పరిణామాల నేపథ్యంలో జానీ మాస్టర్(jani master) భార్య సుమలత నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీని ఫిల్మ్ ఫెడరేషన్ రద్దు చేసింది. ఈ వ్యవహారంపై నిర్వహించిన సమావేశానికి సుమలతతో పాటు కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్(raghu master), అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. మొత్తం 225 మంది డ్యాన్సర్లు పాల్గొనగా, సుమలత(sumalatha)కు 11 మంది మద్దతు తెలిపారు. మరోవైపు రఘు మాస్టర్‌కు 214 మంది డ్యాన్సర్లు మద్దతుగా నిలిచారు.
ఈ పరిణామంతో ప్రస్తుత కమిటీని కొనసాగించకుండా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఫెడరేషన్ డెసిషన్ తీసుకుంది. అక్టోబర్ 11న డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు తాజా ఎన్నికలు నిర్వహించనున్నట్లు అనౌన్స్ చేసింది. కొంతకాలంగా అసోసియేషన్ నిర్వహణ, ఇంటర్నల్ ఎలక్షన్స్, డెసిషన్స్ పై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివాదం ముదరడంతో జానీ మాస్టర్ గతంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించి జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ వ్యవహారం చివరకు ఫిల్మ్ ఫెడరేషన్ వరకు వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ జానీ మాస్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, అనంతరం జానీ మాస్టర్, సుమలతపై నాన్ కోఆపరేషన్ ఆర్డర్ విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే జానీ మాస్టర్ ఫెడరేషన్ ముందు వివరణ ఇవ్వడంతో పాటు, చిరంజీవి(chiranjeevi), బాలకృష్ణ(balakrishna) జోక్యంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. అనంతరం జానీ మాస్టర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణుగుతుందని భావించినా.. తాజాగా కమిటీ రద్దు, కొత్త ఎన్నికల ప్రకటనతో వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.








