డైరెక్టర్ చిన్ననాటి కలల నుంచి పుట్టిన జడల్
నేచురల్ స్టార్ నాని(nani) నటించిన ది ప్యారడైజ్(the paradise) పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు నాని కెరీర్లోనే అత్యంత భారీ స్థాయి ప్రాజెక్ట్‌గా గుర్తింపు వచ్చింది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా ప్రీమియర్స్, డే 1 కలిపి రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసినట్లు చిత్రబృందం పేర్కొంది. అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) మ్యూజిక్ సినిమాపై అంచనాలను మరింత పెంచగా, జడల పాత్రలో నాని గెటప్ ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ లుక్ వెనుక ఉన్న అసలు ఇన్సిపిరేషన్ ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తాజాగా వెల్లడించారు. జడల పాత్ర, అతడి పోరాటం కల్పితమైనవే అయినప్పటికీ.. పాత్రకు ఇచ్చిన జడల రూపం మాత్రం తన చిన్ననాటి జ్ఞాపకాల నుంచి పుట్టిందని ఆయన తెలిపారు. చిన్నప్పుడు తన తల్లి తన జుట్టును జడగా పెంచి కట్టేదని, అదే దృశ్యం తన మనసులో నిలిచిపోయిందని చెప్పారు. పెరిగే కొద్దీ కమర్షియల్ సినిమాలో జడలతో ఓ హీరోను తెరపై ఎలా చూపించాలనే ఆలోచన తనలో ఏర్పడిందని వివరించారు.
చిన్ననాటి ఓ మధురమైన జ్ఞాపకాన్ని ఏళ్ల తర్వాత ఓ స్టార్ హీరోకు ఐకానిక్ లుక్‌గా మార్చడం శ్రీకాంత్ ఓదెల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోంది. తన బాల్యంలోని అనుభూతిని ది ప్యారడైజ్ ప్రపంచంతో ముడిపెట్టిన విధానం ఇప్పుడు ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. డైరెక్టర్ షేర్ చేసిన చిన్ననాటి ఫొటో కూడా వైరల్ కావడంతో జడల లుక్ వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంతో ది ప్యారడైజ్ లో జడల పాత్రను తెరపై ఎలా ఆవిష్కరించారనే ఆసక్తి మరింత పెరిగింది.








