అదే నన్ను ముందుకు నడిపించింది : వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే వ్యాపారవేత్తగా రాణిస్తోన్న ఆయన అమెరికా అధ్యక్ష పీఠంపై కన్నేసి, ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన అదృష్టం అనే పదానికి కొత్త అర్థం చెప్పారు. నా దృష్టిలో లక్ అంటే శ్రమించడమే. ఆ ఫార్ములానే నా జీవితంలో పనిచేసింది. ఒక విద్యార్థిగా, వృతివ్యాపార జీవితాల్లో అదే నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు దానిని నమ్ముకొనే ముందుకు వెళుతున్నా అని వివేక్ అన్నారు. విరాళాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం కంటే పిజ్జా అవుట్లెట్లలో ప్రజలతో సంభాషించడం మేలని భావిస్తున్నాను. మనం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలతో మమేకం కావడానికి ఇదే సరైన మార్గం. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నా ఎన్నికలపై పూర్తి విశ్వాసం ఉంది అంటూ తన ప్రచారం గురించి వెల్లడించారు.






