అమెరికాలో చేయని నేరానికి.. 43 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలోని మిసోరికి చెందిన కెవిన్ స్ట్రిక్లాండ్ చేయని నేరానికి శిక్ష అనుభవించాడు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈ నెల 23న నిర్దోషిగా తేలుస్తూ కోర్టు అతడిని జైలు నుంచి విడుదల చేసింది. దీంతో 18 ఏళ్ల వయసులో అరెస్ట్ అయిన కెవిన్ 62 ఏళ్ల వృద్ధుడిగా జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కెవిన్‌కు ఆర్థిక సాయం అందించేందుకు గో ఫండ్ మీ సంస్థ రూ.10 కోట్లు విరాళంగా సేకరించింది. 1978 ఏప్రిల్ 25న కాన్సస్ నగరంలోని ఓ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ముగ్గురిని కాల్చి చంపారు. ఘటన నుంచి తప్పించుకున్న సింతియా డగ్లస్ అనే మహిళ. కాల్పులు జరిపిన వారిలో కెవిన్ ఉన్నాడని భావించి అతని పేరును పోలీసులక ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తర్వాత తాను పొరబడినట్లు డగ్లస్ తెలుసుకున్నా తప్పు చేసినట్లు ఒప్పకుంటే కోర్టు తన శిక్ష విధిస్తుందేమోనన్న భయంతో పెదవి విప్పలేదు. డగ్లస్ సాక్ష్యాల్ని పరిగణించి కెవిన్‌కు కోర్టు 50 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. దశాబ్దాలు గడిచాక ఈ ఏడాది ఆగస్టులో కెవిన్ శిక్షను సవాల్ చేస్తూ స్థానిక ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో కెవిన్ నిర్దోషి అని కోర్టు తేల్చింది. ఈ నెల 23న కెవిన్ జైలు నుంచి విడుదలయ్యాడు.






