World Cup: ఐపిఎల్ లో ఆడితేనే 2027 జట్టులో చోటు..?
2027 వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియా సన్నాహాలను బీసీసీఐ (BCCI) అప్పుడే వేగవంతం చేసింది. తాజాగా వస్తున్న జాతీయ మీడియా కథనాల ప్రకారం, సెలెక్టర్లు ఇప్పటికే 20 మంది ఆటగాళ్లతో కూడిన ఒక కోర్ గ్రూప్‌ను రెడీ చేసినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. మార్చి 28 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్లో వీరి ప్రదర్శనను నిశితంగా గమనించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది.
ఇవి కూడా చదవండి
ప్రతి సెలెక్టర్ వారానికి కనీసం ఒక మ్యాచ్‌ను స్టేడియం నుండి వీక్షించి, ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్‌ను అంచనా వేస్తారు. ఈ పర్యవేక్షణ ప్రధానంగా 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగానే సాగుతుందని సమాచారం. ఐపీఎల్ ముగిసే సమయానికి వరల్డ్ కప్ జట్టుకు సంబంధించిన ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ను సిద్ధం చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన 20 మంది జాబితాలో ప్రధానంగా, పేస్ దళంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ ల ప్రదర్శన, ఫిట్నెస్ పర్యవేక్షించే అవకాశం ఉంది.
వీరితో పాటుగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రదర్శన కూడా గమనించే అవకాశం ఉంది. మోకాలి గాయం నుండి కోలుకుంటున్న హర్షిత్ రాణా పునరాగమనంపై కూడా సెలెక్టర్లు దృష్టి పెట్టారు. 2027 వన్డే ప్రపంచ కప్ కు అక్టోబర్-నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దక్షిణాఫ్రికా పరిస్థితులకు అలవాటు పడేలా, 2027 లోపు టీమిండియా దాదాపు 27 నుండి 30 వన్డేలు ఆడేలా బీసీసీఐ షెడ్యూల్‌ను రూపొందిస్తోంది. విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohith Sharma) కేవలం వన్డే ఫార్మాట్ లోనే ఆడుతున్న నేపధ్యంలో వారిపై కూడా బోర్డు ఫోకస్ చేసింది.
ఇవి కూడా చదవండి







