ప్రతిరోజూ సాయంత్రం మీరు చూసేది… నిజం కాదు!
— శివ దువ్వూరు
అవును…అది అంత పెద్ద అబద్ధం…అయితే ప్రపంచంలోని దాదాపు ప్రతి మనిషి దాన్ని నిజమని నమ్ముతాడు. ఈరోజు సాయంత్రం కూడా మీరు దాన్ని మళ్లీ చూస్తారు.నమ్ముతారు..అదేంటో చూద్దాం.
సాయింత్రం అవ్వగానే సూర్యుడు నెమ్మదిగా కిందికి దిగుతాడు. ఆకాశం నారింజ, ఎరుపు రంగులతో మెరిసిపోతుంది. కొన్ని క్షణాల తర్వాత సూర్యుడు భూమి అంచున మాయమైపోతాడు. మీరు సహజంగానే అంటారు…”సూర్యుడు అస్తమించాడు.” అని.
అయితే వాస్తవానికి అదేమీ జరగలేదు. ఒక్క క్షణం కూడా అలాంటిదేమీ జరగలేదు. సూర్యుడు ఎక్కడికీ వెళ్లలేదు. కేవలం తిరుగుతున్నది… మీరు నిలబడి ఉన్న భూమి.సూర్యుడు అక్కడే ఉన్నాడు.ఇదంతా మాకు తెలుసు అంటారా..అయితే …
ఇప్పుడు ఒక గమ్మత్తైన విషయం… ప్రశ్న.
ప్రతిరోజూ మీ కళ్లే ఇంతలా పొరబడితే..మీరు జీవితంలో నిజమని నమ్ముతున్న మిగతా విషయాల సంగతేంటి? మీరు చూస్తున్న ప్రపంచం నిజంగానే అలానే ఉందా? లేక… మీ మెదడు మీ కోసం నిర్మించిన ఒక కథనాన్నే మీరు “వాస్తవం” అని నమ్ముతున్నారా?
ఈ ఒక్క ప్రశ్న…ఒక సూర్యాస్తమయం నుంచి ప్రారంభమై…క్వాంటమ్ ఫిజిక్స్ వరకు వెళ్లింది. అక్కడి నుంచి… ఉపనిషత్తుల వరకు చేరింది. ఎందుకంటే ఈ కథనం సూర్యుడి గురించి కాదు. మనిషి “వాస్తవం”ని ఎలా చూస్తాడనే ప్రశ్న గురించి.
గోదావరిలోకి సూర్యుడు
అంతెందుకు రాజమండ్రి గోదావరి గట్టు మీద నిలబడి మీరు సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. కాసేపటికి సూర్యుడు నెమ్మదిగా నదిలోకి దిగిపోతున్నట్టే కనిపిస్తాడు. ఆ దృశ్యం నిజమే. ఆ అందం నిజమే.ఆ అనుభూతి కూడా నిజమే. కానీ సూర్యుడు నదిలోకి దిగడం మాత్రం నిజం కాదు. అంటే మన కళ్లకు కనిపిస్తున్న దృశ్యం ఒకటి. విశ్వంలో జరుగుతున్న సంఘటన మరోటి. ఇదే ఈ కథకు కేంద్రబిందువు.
అంటే మనం ప్రపంచాన్ని చూడం… ప్రపంచానికి వచ్చిన అనువాదాన్ని మాత్రమే చూస్తాం. మన కళ్లే ప్రపంచాన్ని పూర్తిగా చూడవు. వెలుతురులో చాలా చిన్న భాగాన్ని మాత్రమే గుర్తిస్తాయి. మన చెవులు కూడా కొన్ని శబ్దాలను మాత్రమే వింటాయి. అలాగే పాములు వేడిని చూస్తాయి. గబ్బిలాలు శబ్దంతో దారి కనుక్కుంటాయి. తేనెటీగలు మనకు కనిపించని రంగులను కూడా గుర్తిస్తాయి. అంటే…మనం అంతా ఒకే ప్రపంచంలో ఉన్నా, ఒకే ప్రపంచాన్ని చూస్తున్నా, ఏ జీవికి ఆ జీవి దాన్ని వేరే విధంగా అనుభవిస్తోంది.
అయితే అసలు ప్రపంచం ఏది?
మనకు కనిపించేదా? పాముకు కనిపించేదా?, తేనెటీగ చూసేదా? లేక ఇవన్నీ కలిపినా ఇంకా పూర్తికాని చిత్రమా?. మన మెదడు బయట నుంచి వచ్చే సంకేతాలను రంగులుగా, శబ్దాలుగా, వాసనలుగా, ఆకారాలుగా మార్చి మన ముందొక ప్రపంచాన్ని నిర్మిస్తుంది. అందుకే మనం అనుభవించేది అసత్యం కాదు. కానీ అది వాస్తవానికి వచ్చిన ఒక వ్యాఖ్యానం మాత్రమే కావచ్చు.
ఇక్కడే “మాయ” అనే పదాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. “మాయ” అంటే చాలా మంది “అంతా అబద్ధమే” అని అనుకుంటారు. కానీ అద్వైత వేదాంతం చెప్పేది అది కాదు. ఈ ప్రపంచం లేదు అని కాదు. ఈ ప్రపంచం మీకు కనిపిస్తున్న రూపమే అంతిమ సత్యం కాకపోవచ్చు అని చెబుతుంది.
సూర్యాస్తమయం అబద్ధం కాదు. కానీ పూర్తి నిజం కూడా కాదు. అదే విధంగా…మన అనుభవం నిజమే.
కానీ దాని వెనుక ఇంకా లోతైన వాస్తవం ఉండవచ్చని ఉపనిషత్తులు సూచిస్తాయి.అలలు కనిపిస్తాయి… నీరు కనిపించదు సముద్రం ఒడ్డున నిలబడి ఉంటే మనకు అలలే కనిపిస్తాయి. ఒక అల వస్తుంది. మరో అల పోతుంది. కానీ ప్రతి అల వెనుక ఉన్నది ఒక్కటే. నీరు.
ఉపనిషత్తులు కూడా ఇదే ప్రశ్న అడుగుతాయి.
మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం అలలాంటిదా? దాని వెనుక మార్పులేని ఏదైనా ఉందా? ఆ మార్పులేని ఆధారాన్నే అవి బ్రహ్మం అని పిలుస్తాయి. క్వాంటమ్ ఫిజిక్స్ ఒక శాస్త్రవేత్తను ఈ ప్రశ్న దగ్గరకు తీసుకువచ్చింది. క్వాంటమ్ ఫిజిక్స్‌కు పునాదులు వేసిన శాస్త్రవేత్తలలో ఒకరైన ఎర్విన్ శ్రోడింగర్ను ఒక ప్రశ్న చాలాకాలం వెంటాడింది. ప్రపంచాన్ని మనం గ్రహిస్తున్న విధానం మన మెదడుపై ఆధారపడి ఉంటే…నేను చూసే ప్రపంచం, మీరు చూసే ప్రపంచం ఎందుకు ఒకటే? నేను ఒక పువ్వును చూస్తాను. మీరు కూడా అదే పువ్వును చూస్తారు. రంగు కొద్దిగా వేరుగా అనిపించొచ్చు. అనుభూతి వేరుగా ఉండొచ్చు. కానీ అది పువ్వే అని ఇద్దరం అంగీకరిస్తాం. అయితే కోట్లాది మనస్సులు ఒకే ప్రపంచాన్ని ఎలా పంచుకుంటున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ శ్రోడింగర్ ఉపనిషత్తులను అధ్యయనం చేశాడు.ఆయనకు తెలిసింది ఏమిటి?
ఎన్నో కిటికీలు… కానీ వెలుగు ఒక్కటే
ఒక ఇంట్లో పది కిటికీలు ఉన్నాయని ఊహించండి. ఒకటి పెద్దది. ఒకటి చిన్నది. మరోదానికి రంగు అద్దం ఉంది. ప్రతి గదిలోకి వచ్చే వెలుగు వేరుగా కనిపిస్తుంది. కానీ వెలుగుకు మూలం మాత్రం ఒక్కటే. ఉపనిషత్తులు కూడా ఇదే భావనను ప్రతిపాదిస్తాయి. మనస్సులు వేరుగా కనిపించవచ్చు. వ్యక్తులు వేరుగా ఉండవచ్చు. కానీ చైతన్యానికి మూలం ఒక్కటే కావచ్చని అవి సూచిస్తాయి. ఈ ఆలోచన శ్రోడింగర్ను ఆకర్షించింది. అయితే ఇది ఒక తాత్విక దృష్టికోణం మాత్రమే. భౌతిక శాస్త్రం దీనిని నిరూపించిందని ఆయన ఎప్పుడూ చెప్పలేదు.
శాస్త్రం ఒక దారి… తత్వశాస్త్రం మరో దారి
భౌతిక శాస్త్రం ప్రయోగాలు చేస్తుంది. కొలుస్తుంది. లెక్కలు వేస్తుంది. తత్వశాస్త్రం ప్రశ్నలు అడుగుతుంది. అనుభవాన్ని పరిశీలిస్తుంది. చైతన్యాన్ని అన్వేషిస్తుంది. రెండూ ఒకే రహస్యాన్ని చూడాలని ప్రయత్నించవచ్చు. కానీ రెండు వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తాయి.
ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయాన్ని మరోసారి చూడండి…
ఈసారి ఒక అందమైన దృశ్యంగా మాత్రమే కాదు…ఒక ప్రశ్నగా చూడండి. మనకు కనిపించేది నిజమే. కానీ అది సంపూర్ణ సత్యమా? సూర్యుడు అస్తమిస్తున్నట్లు కనిపిస్తాడు. భూమి తిరుగుతోంది.అలాగే మన అనుభవం నిజమే. కానీ వాస్తవం… మనకు కనిపించేదానికంటే ఎప్పుడూ కొంచెం లోతుగానే ఉంటుంది.
విశ్వంలో అత్యంత లోతైన ప్రశ్న ఒక్కటే
“నేను చూస్తున్నది నిజమా… లేక ఆ నిజానికి వచ్చిన నా అనువాదమా?”
కృతజ్ఞతలు: ఈ వ్యాసానికి ప్రేరణగా శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు ఈమాట పత్రికలో (సెప్టెంబర్ 2023) ప్రచురించిన “గుళిక వేదాంతం” వ్యాసంలోని కొన్ని భావాలు నిలిచాయి.








