చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్ మార్క్ కేసీఆర్ : జస్టిస్ ఎన్.వి.రమణ

చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్‌మార్క్ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో సీఎం కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్.వి.రమణ మాట్లాడుతూ కేసుల త్వరిగతిన పరిష్కారానికి జడ్జిల సంఖ్య పెంపు అవసరమని అన్నారు. తెలంగాణ హైకోర్టులో ఇటీవల జడ్జిల సఖ్య పెంచామని, రెండుళ్లుగా పెండిరగ్‌లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించామని తెలిపారు. న్యాయవ్యవస్థను ఇంకా బలపరచాలని భావిస్తున్నామని, జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. మౌలిక వసతులు, ఖాళీల భర్తీపై దృష్టి పెట్టాం. న్యాయవ్యవస్థ మానవీయ కోణంలో పనిచేయాలి. అన్ని వర్గాలనూ సమానంగా గౌరవించాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులకు అప్‌గ్రేడ్ కావాలన్నారు. న్యాయమూర్తులు ఎలాంటి భయం లేకుండా పనిచేయాలి. న్యాయమూర్తులపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. న్యాయాధికారులు ఆరోగ్యం, కుటుంబంపై దృష్టి పెట్టాలి. న్యాయాధికారుల పే కమిషన్‌కు సంబంధించి త్వరలో శుభవార్త ఉంటుంది అని సీజేఐ తెలిపారు.
దేశవ్యాప్తంగా, రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకుని ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని భావిస్తుంటారని, తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రం 4,320కి పైగా ఉద్యోగాలను సృష్టించారని తెలిపారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ తరపున కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుకొంటున్నామన్నారు.