కొండా సురేఖ భవిష్యత్తు తేల్చేది ఆ లేఖేనా?
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని ఏఐసీసీ, పీసీసీ నాయకత్వం అత్యంత తీవ్రంగా పరిగణించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు మంత్రి కొండా సురేఖ గురువారం సాయంత్రం లిఖితపూర్వక వివరణ ఇవ్వనున్నారు. సురేఖ ఇచ్చే ఈ వివరణే ఆమె రాజకీయ భవిష్యత్తును, కేబినెట్లో ఆమె స్థానాన్ని నిర్ణయించనుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
బుధవారం సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన తీవ్ర ఆరోపణలు కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు చేరాయి. ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రిపై సొంత మంత్రి కుటుంబ సభ్యురాలే బహిరంగంగా విమర్శలు గుప్పించడాన్ని క్రమశిక్షణ ఉల్లంఘనగా పార్టీ భావించింది. సుస్మిత పటేల్‌పై నేరుగా క్రమశిక్షణా చర్యలు తీసుకుందామంటే.. ఆమెకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేకపోవడం పార్టీ పెద్దలను విస్మయానికి గురిచేసింది. పార్టీ సభ్యురాలు కాని వ్యక్తికి నోటీసు ఇచ్చే వెసులుబాటు లేకపోవడంతో, ఆ బాధ్యతను నేరుగా కేబినెట్ మంత్రిగా ఉన్న తల్లి కొండా సురేఖపైనే మోపింది క్రమశిక్షణ కమిటీ. ఈ మేరకు మంత్రి కొండా సురేఖకే నేరుగా షోకాజ్ నోటీసు జారీ చేసి, తక్షణ వివరణ కోరింది.
గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో మంత్రి కొండా సురేఖ స్వయంగా కల్పించుకుని, కూతురి వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ సీఎంకు క్షమాపణలు చెప్పి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అయితే, ఒకసారి పొరపాటు జరిగిందని సరిదిద్దుకున్న తర్వాత కూడా మళ్లీ అదే తరహాలో ముఖ్యమంత్రిపై బహిరంగ విమర్శలు చేయడం వెనుక గల ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో మాదిరిగా కేవలం ఒక క్షమాపణ లేఖతో ఈ వివాదం సద్దుమణుగుతుందా? లేక అధిష్ఠానం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుందా? అన్నది పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
క్రమశిక్షణ కమిటీకి సమర్పించే లేఖలో కొండా సురేఖ ఏ వైఖరి తీసుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె ముందు ప్రధానంగా మూడు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి కూతురి వ్యాఖ్యలకు మద్దతు తెలపడం. కూతురు లేవనెత్తిన అంశాలను సమర్థిస్తే అది నేరుగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లే అవుతుంది. ఇది మంత్రి పదవికి ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. రెండోది కూతురి వ్యాఖ్యలను ఖండించి క్షమాపణ కోరడం. కూతురి వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని తేల్చిచెప్పడం. తద్వారా అధిష్ఠానం ఆగ్రహం నుంచి తప్పించుకోవడం. మూడోది పరకాల రాజకీయాన్ని తెరపైకి తేవడం. కూతురి వ్యాఖ్యలపై పెద్దగా స్పందించకుండా, స్థానిక రాజకీయం, పరకాల నియోజకవర్గంలో తమ వర్గానికి జరుగుతున్న అన్యాయం, గ్రూపు రాజకీయాల వల్లే అసహనంతో ఈ వ్యాఖ్యలు వచ్చాయనే విషయాన్ని లేఖలో ప్రస్తావించడం.
కొండా కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, బలమైన క్యాడర్ ఉన్నాయి. అయితే, ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో నేరుగా తలపడటం కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. క్రమశిక్షణ కమిటీకి ఇచ్చే వివరణ అసంతృప్తికరంగా ఉంటే అధిష్ఠానం ఎలాంటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ పంపే లేఖ ఈ వివాదానికి ముగింపు పలుకుతుందా, లేక కాంగ్రెస్ పార్టీలో సరికొత్త రాజకీయ సంక్షోభానికి నాంది పలుకుతుందా అనేది కొద్ది గంటల్లో తేలనుంది.








