Konda Family: వివాదాల ‘కొండా’పై అధిష్ఠానం కొరడా?
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ తీరు ఇప్పుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆ కుటుంబం, వరుసగా చేస్తున్న స్వయంకృతాపరాధాలు పార్టీని తీవ్ర ఆత్మరక్షణలోకి నెడుతున్నాయి. అధికారం చేతిలో ఉందన్న అహంకారమో లేక అధిష్ఠానం తమను ఏమీ చేయలేదన్న మితిమీరిన ధీమానో తెలియదు కానీ, కొండా వారసురాలు సుస్మితా పటేల్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు గాంధీ భవన్‌తో పాటు ఢిల్లీ పీఠాన్ని కూడా కదిలిస్తున్నాయి. నిన్నటికి నిన్న నోరుజారి తీవ్ర దుమారం రేపిన వ్యవహారం చల్లారకముందే, మళ్లీ అదే తరహా దూకుడు ప్రదర్శించడం వెనుక అసలు వ్యూహం ఏమిటనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
గతంలో కూడా కొండా సుస్మితా పటేల్ ఇలాగే తీవ్రస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఆ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీయడంతో, మంత్రి కొండా సురేఖ స్వయంగా రంగంలోకి దిగి సర్దిచెప్పాల్సి వచ్చింది. స్వయంగా వెళ్లి క్షమాపణలు చెప్పి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. అయితే, ఆ చేదు అనుభవం నుంచి కొండా ఫ్యామిలీ ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు మరోసారి సుస్మితా పటేల్ హద్దులు దాటి మాట్లాడుతుండటం, సొంత పార్టీ నాయకులనే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలను ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కూతురు బహిరంగంగా ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా, మంత్రి కొండా సురేఖ ఇప్పటివరకు వాటిని ఖండించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కనీసం అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఇదంతా కొండా సురేఖ, కొండా మురళి దంపతులు తెరవెనుక ఉండి ఆడిస్తున్న పక్కా రాజకీయ డ్రామా అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలపడుతోంది. తాము నేరుగా మాట్లాడితే మంత్రి పదవికి ముప్పు వస్తుందనే ఉద్దేశంతోనే, కూతురిని పావుగా వాడుకుని సొంత పార్టీపైనే ఒత్తిడి తెచ్చే బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొండా సురేఖ గతంలో సినీ ప్రముఖుల వ్యవహారంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మొదలుకొని, స్థానిక వర్గ విభేదాల వరకు ఎన్ని తప్పులు చేసినా కాంగ్రెస్ నాయకత్వం ఆమెకు సముచిత గౌరవమే ఇచ్చింది. బీసీ మహిళా కోటాలో కీలకమైన మంత్రి పదవిని కట్టబెట్టి, అనేక సందర్భాల్లో వెనకేసుకొచ్చింది. కానీ, ‘దేనికైనా ఒక హద్దు ఉంటుంది’ అన్న చందంగా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొండా ఫ్యామిలీ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నాయకత్వం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
పార్టీ క్రమశిక్షణను తుంగలో తొక్కుతూ, ప్రభుత్వ ప్రతిష్టను బజారున పడేస్తున్న ఈ వైఖరిని ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదని హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా, కొండా ఫ్యామిలీపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. అవసరమైతే మంత్రివర్గం నుంచి తప్పించడానికి కూడా అధిష్ఠానం వెనుకాడబోదనే సంకేతాలు వెలువడుతున్నాయి. కొండా వారి నోటిదురుసు రాజకీయాలకు ఈసారైనా హైకమాండ్ ముకుతాడు వేస్తుందో లేదో చూడాలి.








