మృతదేహంతో వైరస్ వ్యాపించదు
కరోనా సోకి ఎవరైనా చనిపోతే అపోహలతో వారి అంత్యక్రియలను అడ్డుకోవడం సంస్కారం కాదని షికాగో (అమెరికా)లోని ఇల్లినాయిస్ వర్సిటీ అంటువ్యాధుల వైద్యనిపుణులు డాక్టర్ విజయ్ ఎల్దండి అన్నారు. మృతదేహాలతో కరోనా వ్యాపించదన్న వాస్తవాన్ని అంతా గమనించాలని ఆయన సూచించారు. దీనిపై అనవసర భయాందోళనలు వద్దని, ప్రజలు మానవత్వంతో మసలాలని కోరారు. నిబంధనలను విధిగా పాటించాలన్నారు. కరోనా కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను కొన్ని గ్రామాల్లో అడ్డుకుంటున్న విషయం మీడియా ద్వారా తెలుసుకున్న డా.విజయ్ స్పందించారు. విషయాన్ని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వినోద్‌కు ఆయన లేఖ అందజేశారు. మంత్రి ఈటల రాజేందర్‌కు సైతం లేఖ రాశానని విజయ్ చెప్పారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ మృతదేహాలను అడ్డుకున్న ఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి అంతిమ సంస్కారాలు నిర్వహించి గౌరవాన్ని ఇవ్వాల్సిన కనీస బాధ్యతలను ఎవ్వరూ విస్మరించకూడదన్నారు.













