వికారాబాద్లో ఉద్రిక్తత.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్
Vikarabad: పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన వికారాబాద్లో ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల భూములను బలవంతంగా లాక్కోవడాన్ని నిరసిస్తూ ఉదయం నుంచి ఆందోళన బాట పట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్టు చేశారు.
భూసేకరణ నోటిఫికేషన్: పారిశ్రామికీకరణ పేరుతో ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని కవిత మండిపడ్డారు. భూసేకరణ నోటిఫికేషన్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ఆమె వికారాబాద్ ఆర్డీవో (RDO) కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం తన మొండివైఖరిని వీడకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నిరసనకారుల అరెస్ట్: అంతకుముందు స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట వలన పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు పలువురు రైతులను, నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి తెలంగాణ జాగృతితో పాటు ధర్మ సమాజ్ పార్టీ ప్రతినిధులు కూడా హాజరై రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.








