Revanth Reddy: రేవంత్ రెడ్డి మైండ్ బ్లోయింగ్ గ్రాఫ్!
భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల (IE 100) జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించిన స్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలవడం సహజమే అయినా, కేవలం కొన్ని ఏళ్లలోనే ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి గుర్తింపు పొందడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ గ్రాఫ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ జాబితాలో ఆయనకు లభించిన 25వ స్థానం కేవలం ఒక అంకె మాత్రమే కాదు, అది ఆయన రాజకీయ చతురతకు, వ్యూహరచనకు నిదర్శనం.
ఢిల్లీ రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే (43వ స్థానం), గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంక గాంధీ (35వ స్థానం) వంటి ఉద్ధండుల కంటే రేవంత్ రెడ్డి ముందు వరుసలో నిలవడం చిన్న విషయం కాదు. తన రాజకీయ గురువు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 13వ స్థానంలో ఉండగా, ఆయన శిష్యుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్, అనతి కాలంలోనే 25వ స్థానానికి చేరుకోవడం విశేషం. తెలంగాణ కాంగ్రెస్‌లో హేమాహేమీల వంటి సీనియర్లు ఉన్నప్పటికీ, అధిష్టానం రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగించడం వెనుక ఉన్న నమ్మకాన్ని ఆయన వంద శాతం నిలబెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి
రేవంత్ రెడ్డి కేవలం ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా, పార్టీని నడిపించే ఒక శక్తివంతమైన సైన్యాధ్యక్షుడిగా ఎదిగారు. కాంగ్రెస్ వంటి అంతర్గత ప్రజాస్వామ్యం, అసమ్మతి ఎక్కువ ఉన్న పార్టీలో, అందరినీ కలుపుకుపోతూ గ్రూపు రాజకీయాలకు తావులేకుండా చేయడంలో ఆయన సఫలమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరచడం, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయడంలో రేవంత్ స్టైల్ ప్రత్యేకం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారు. దూకుడుగా ఉండే ప్రసంగాలు, తడబడని నడక ఆయనను యువతలో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి.
సాధారణంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నిరంతరం ఘర్షణ వైఖరిని అవలంబిస్తుంటారు. కానీ, రేవంత్ రెడ్డి ఇక్కడ విలక్షణమైన పంథాను అనుసరిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే, రాజకీయంగా ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో ఆయనకు బాగా తెలుసు. మోదీ సర్కార్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సానుకూలంగా స్పందిస్తుండటం రేవంత్ రెడ్డి దౌత్యనీతికి నిదర్శనం. వివాదాల కంటే అభివృద్ధి ముఖ్యం అనే ధోరణితో ఆయన కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు.
ఈ పవర్ ఫుల్ పర్సన్స్ జాబితా ఒక సంకేతాన్ని స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారు. దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా, జాతీయ స్థాయిలో మోదీ వంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవడంలో రేవంత్ వ్యూహాలు పార్టీకి కీలకం కానున్నాయి. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి దేశంలోనే 25వ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగిన రేవంత్ రెడ్డి ప్రస్థానం, రాజకీయాల్లో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తోంది.
ఇవి కూడా చదవండి








