సీమాంధ్రులపై రేవంత్ కన్నేసారా?
తెలంగాణ రాజకీయాల్లో గ్రేటర్ హైదరాబాద్ ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన లక్షలాది మంది ఓటర్లు ఈ నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే శక్తులుగా మారారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో భయాందోళనలకు గురైన ఈ ఓటర్లు, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. అయితే, ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా ఈ సమీకరణాలను మార్చే పెద్ద వ్యూహానికి తెరలేపారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సీమాంధ్రులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించింది. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యధిక స్థానాలను టీడీపీ-బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సెటిలర్ల భద్రతకు పెద్దపీట వేస్తూ, వారిపై ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరిపోయారు.
టీఆర్ఎస్ ఈగ వాలనివ్వని వ్యూహం బాగా పనిచేసింది. దాంతో 2018 శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఆఖరికి 2023లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అధికారంలోకి వచ్చినప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం సీమాంధ్ర ఓటర్లు బీఆర్ఎస్ వైపే నిలిచారు. ఈ మద్దతే వరుస ఎన్నికల్లో గులాబీ పార్టీకి కొండంత అండగా నిలుస్తూ వచ్చింది.
ఇవి కూడా చదవండి
ఇప్పుడు బీఆర్ఎస్ కు ఉన్న ఈ బలమైన కంచుకోటను బద్దలు కొట్టేందుకు రేవంత్ రెడ్డి ఒక భారీ స్కెచ్ వేశారు. హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్పేట మైత్రీవనం జంక్షన్ వద్ద 23 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.
తెలంగాణవాదుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, దేనికీ వెనకడుగు వేయకుండా రేవంత్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ గుప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్, సానుభూతిపరులను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం దీని వెనుక ప్రధాన ఉద్దేశం. ఎన్టీఆర్ కేవలం ఆంధ్రాకే పరిమితం కాదని, తెలుగుజాతి గర్వించదగ్గ నేతని కొనియాడటం ద్వారా బీఆర్ఎస్ మళ్లీ ‘తెలంగాణ సెంటిమెంట్’ను రగల్చకుండా ముందస్తుగా అడ్డుకట్ట వేయడం ఇందులో కనిపిస్తోంది. తాము అధికారంలో ఉంటే సీమాంధ్రులకు పూర్తి అండగా ఉంటామనే బలమైన సంకేతాన్ని పంపించారు.
మరోవైపు, సీమాంధ్రులను కేవలం ఎన్నికల లబ్ధి కోసమే బీఆర్ఎస్ వాడుకుందని, ఎన్నికలు అయిపోగానే మళ్లీ విషం చిమ్ముతోందనే విమర్శలు చేస్తోందనే ప్రచారం క్షేత్రస్థాయిలో ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వేసిన ఎన్టీఆర్ విగ్రహ వ్యూహం గ్రేటర్ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కానుంది.
బీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా ఉన్న సీమాంధ్రులు గనుక కాంగ్రెస్ వైపు మళ్లితే, రాబోయే స్థానిక సంస్థలు లేదా ఇతర ఎన్నికల్లో గులాబీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం. రేవంత్ రెడ్డి వేసిన ఈ ‘ఆంధ్రా సెంటిమెంట్’ విరుగుడు స్కెచ్ ఏ మేరకు పారుతుందో, గ్రేటర్ ఓటర్లు ఎటువైపు నిలబడతారో తెలియాలంటే రాబోయే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి







