రేవంత్ రెడ్డి ‘రాజకీయ సాహసం’!
తెలంగాణ రాజకీయ యవనికపై ఇప్పుడు రేవంత్ రెడ్డి సాహసం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ప్రాంతీయ విభేదాల కుంపట్ల మధ్య, సీమాంధ్ర పాలకులపైన, ఆంధ్రా మూలాలపైన ఒక వర్గం విపరీతమైన ద్వేషాన్ని నూరిపోస్తున్న వేళ.. హైదరాబాద్ నడిబొడ్డున, అమీర్పేట చౌరస్తాలో తెలుగుజాతి గర్వించదగ్గ మహానాయకుడు నందమూరి తారకరామారావు విగ్రహం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి విమర్శల తుపానులను లెక్కచేయకుండా, స్వపక్షంలోని సొంత గొంతుల అభ్యంతరాలను తొక్కుకుంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి తనేంటో, తన దమ్ము ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ఇది కేవలం ఒక విగ్రహావిష్కరణ కాదు.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే రేవంత్ మార్క్ రాజకీయ చాణక్యం.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటూ, ఒకప్పటి ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం వ్యవస్థాపకుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీనిపై రాజకీయంగా ఎన్నో విమర్శలు, మరెన్నో అపోహలు సృష్టించే ప్రయత్నం జరిగింది. కానీ, రేవంత్ రెడ్డి వాటన్నింటినీ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఎన్టీఆర్ను ఏ ఒక్క ప్రాంతానికో, కులానికో పరిమితం చేయడం అజ్ఞానమే అవుతుందని చాటిచెప్పారు.
ఇవి కూడా చదవండి
సమాజంలో అణగారిన వర్గాల కోసం పోరాడిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పేదల పాలిట పెన్నిధిగా నిలిచిన ఇందిరా గాంధీ సరసన ఎన్టీఆర్ను నిలబెట్టి.. ఆయన నిరుపేదల పక్షపాతి అని నినదించారు. అన్నగారు తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక అని, ఆయన్ను ప్రాంతీయ సంకెళ్లతో బంధించలేమని రేవంత్ రెడ్డి భావోద్వేగంగా ప్రకటించిన తీరు.. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి గుండెలను తాకింది.
ఈ వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్పై, ముఖ్యంగా కేసీఆర్పై సంధించిన విమర్శనాస్త్రాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో, ఆయన కాళ్ల చెంత రాజకీయ ఒనమాలు నేర్చుకుని, ఈ రోజు ఆ స్థాయికి చేరిన కేసీఆర్ వంటి నాయకులు.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ను, ఆయన వారసత్వాన్ని విమర్శించడాన్ని రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు. ఎదిగిన కొద్దీ ఒదగాల్సింది పోయి, రాజకీయ జన్మనిచ్చిన నాయకుడినే విస్మరించడం, విమర్శించడం ద్రోహమే అవుతుందన్నారు. తెలంగాణ సమాజంలో కృతజ్ఞతకు, ద్రోహానికి మధ్య ఉన్న తేడాను కళ్లకు కట్టింది. అధికార దాహంతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసిన వారికి ఈ విగ్రహావిష్కరణ ఒక గట్టి చెంపపెట్టుగా నిలిచింది.
ఈ విగ్రహావిష్కరణ వెనుక రేవంత్ రెడ్డి కేవలం భావోద్వేగాన్నే నమ్ముకోలేదు.. అత్యంత పదునైన, వ్యూహాత్మక రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులను, నందమూరి అభిమానులను కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా ఈ సందర్భాన్ని ఆయన మలుచుకున్నారు.
ప్రాంతీయ విభేదాలను పక్కనబెట్టి, తెలుగు వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చే మహా నాయకుడిగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. అటు సీమాంధ్ర ఓటర్లలో నమ్మకాన్ని పెంచుతూనే, ఇటు తెలంగాణ ఆత్మగౌరవానికి తానే నిజమైన వారసుడినని నిరూపించుకున్నారు. వ్యూహాత్మకంగా ప్రత్యర్థుల నోళ్లు మూయించడంలో రేవంత్ రెడ్డి ఎంతటి సమర్థుడో ఈ ఘటనే సాక్ష్యం.
సవాళ్లకు ఎదురువెళ్లడం రేవంత్ రెడ్డి నైజం. విమర్శలు వస్తాయని తెలిసి కూడా, అమీర్పేట సాక్షిగా అన్నగారి విగ్రహాన్ని నిలబెట్టి, తెలుగుజాతి గుండెల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. భావోద్వేగాలను రగిలిస్తూనే.. లౌక్యంతో, ధైర్యంతో రేవంత్ రెడ్డి వేసిన ఈ అడుగు తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది దమ్మున్న నాయకుడి.. దిమ్మతిరిగే రాజకీయ వ్యూహం!
ఇవి కూడా చదవండి







