కేఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో రోడ్డు భద్రత–డ్రగ్ అవగాహన
యువత బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి: సీపీ డా. ఎం. రమేష్, డీసీపీ జే. రంజన్ రతన్ కుమార్ సూచన
విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు, డ్రగ్ల దుష్ప్రభావాలపై జాగ్రత్తలు కల్పించేందుకు కేఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, ట్రాన్స్పోర్ట్ శాఖ అధికారులు పాల్గొని విద్యార్థులతో మమేకమై సురక్షిత రోడ్డు వినియోగంపై ప్రాయోగిక సూచనలు అందించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ ప్రాణాల విలువను గుర్తించి రోడ్లపై బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. వ్యక్తిగత అనుభవాలపై ఆలోచించాలంటూ విద్యార్థులను ప్రోత్సహించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే భావోద్వేగ, సామాజిక ప్రభావాలను వివరించారు. ట్రాఫిక్ భద్రత కోసం తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న చర్యలను వెల్లడించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు.
సైబరాబాద్ ట్రాఫిక్–I డీసీపీ జే. రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. దీర్ఘ ప్రయాణాల్లో అలసట ప్రమాదాలకు కారణమవుతుందని, ప్రతి రెండు గంటలకు విరామం తీసుకోవాలని సూచించారు. వాహనాలను సక్రమంగా నిర్వహించడం, సీటు బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అన్నారు.
ఇవి కూడా చదవండి
కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్టీఏ కొండాపూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నవీన్, ట్రాఫిక్ ఎస్హెచ్ఓ శ్రీధర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు.
కేఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ డీన్ డా. ఆనంద్ బెతపూడి అతిథులను స్వాగతించి, విద్యార్థుల్లో సామాజిక బాధ్యతపై అవగాహన కల్పిస్తున్నందుకు అభినందించారు. హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాల పాటింపు, బాధ్యతాయుత ప్రవర్తన అవసరాన్ని అధికారులు వివరించారు.
కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఎర్. కొనేరూ లక్ష్మణ్ హవీష్ మాట్లాడుతూ “విద్య అనేది తరగతి గదులకు మాత్రమే పరిమితం కాదు. రోడ్డు భద్రత, బాధ్యతాయుత ప్రవర్తనపై అవగాహన పెంపు ద్వారా సమాజానికి బాధ్యతగల పౌరులను తీర్చిదిద్దాలి. రోడ్లపై తీసుకునే ప్రతి నిర్ణయం వ్యక్తిగతంగా మాత్రమే కాక సమాజానికి కూడా ప్రభావం చూపుతుంది. ఇటువంటి కార్యక్రమాలు భద్రత, క్రమశిక్షణ, ప్రాణాల పట్ల గౌరవం పెంపుకు దోహదపడతాయి” అన్నారు.
ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల్లో రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై మరింత అవగాహన పెరిగింది.








