Etala Rajendar: ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారా..?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మీదనే ఉంది. ఉద్యమ కాలం నుండి నేటి వరకు తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈటల, ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తన పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేపాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత అనివార్య కారణాలతో బయటకు వచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్, ప్రస్తుతం ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీలో ఆయనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదని, అంతర్గత విభేదాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే, కాంగ్రెస్ నుండి బయటకు వస్తున్న జీవన్ రెడ్డితో కలిసి ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ హైకమాండ్‌తో ప్రాథమిక చర్చలు ముగిశాయని, ముహూర్తం మాత్రమే ఖరారు కావాల్సి ఉందనేది తాజా సమాచారం.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ తన పుట్టినరోజున అభిమానులను ఉద్దేశించి చేసిన ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తన ప్రసంగంలో ఎక్కడా బీజేపీ పేరును కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆయన మాటల్లో నిగూఢంగా ఉన్న అర్థం ఆయన పార్టీ మార్పును బలపరుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. “మాతో పెట్టుకోవడం అంటే ధర్మంతో పెట్టుకున్నట్టే.. నిండు కుండ తొణకదు” అంటూ ఆయన తన నైతిక బలాన్ని చాటుకున్నారు. తాత్కాలికంగా ఒడిదుడుకులు ఎదురైనా అంతిమ విజయం ధర్మానిదేనని చెప్పడం ద్వారా, ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిడిని సూచించారు. “తెలంగాణ తెచ్చుకున్నది దోపిడీ కోసమో, దొంగల కోసమో కాదు” అని ప్రస్తుత పాలకులపై విమర్శలు చేస్తూనే, తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నడుచుకుంటానని స్పష్టం చేశారు. “తెలంగాణ ప్రజల ఆలోచన ఏముంటుందో నా ఆలోచన కూడా అదే ఉంటుంది” అని అనడం ద్వారా ప్రజల అభీష్టం మేరకు తన తదుపరి అడుగు ఉంటుందని హింట్ ఇచ్చారు.
“పులి బక్కపడ్డ పులి చారలు పోవు” అంటూ తన ఆత్మగౌరవాన్ని ఎవరూ అణచలేరని హెచ్చరించారు. అవమానాల నుండే ఘర్షణ, ఘర్షణ నుండే మార్పు వస్తుందని చెప్పడం ద్వారా త్వరలోనే ఒక పెద్ద రాజకీయ మార్పుకు తాను శ్రీకారం చుట్టబోతున్నట్లు సంకేతాలిచ్చారు.
జడ్చర్ల నుంచి వచ్చిన వారు తన చెవిలో “మీ కోసం ఎదురు చూస్తున్నాం అన్న” అని చెప్పిన మాటను ప్రస్తావించడం ద్వారా, క్షేత్రస్థాయిలో ప్రజలు తనను మళ్ళీ పాత రూపంలో బహుశా బీఆర్ఎస్లో చూడాలని కోరుకుంటున్నారనే విషయాన్ని పరోక్షంగా బయటపెట్టారు. పదవుల కోసం తాను ఎప్పుడూ పాకులాడలేదని, వ్యాపారాల నుండి రాజకీయాలకు వచ్చానని ఈటల గుర్తు చేయడం ద్వారా.. బీజేపీలో ఎంపీ పదవి ఉన్నప్పటికీ, ఆత్మగౌరవం లేని చోట తాను ఉండలేననే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
ఒకవైపు బీఆర్ఎస్ తన పాత సైనికులను మళ్ళీ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం, మరోవైపు ఈటల మాటల్లో అధికార కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, ప్రస్తుత బీజేపీ పట్ల మౌనం కనిపిస్తుండటంతో.. ‘ఈటల పునరాగమనం’ దాదాపు ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఘర్షణ నుండి మార్పు వస్తుందని నమ్మే ఈటల, ఈసారి ఎలాంటి మార్పుతో తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి








