స్టూడెంట్స్ అలర్ట్.. అడ్మిషన్లకు ఈ పత్రాలు ఉంటేనే సీటు!
Medchal: జిల్లా వ్యాప్తంగా పది , ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో, తదుపరి విద్యా సంవత్సరానికి (2026-27) సిద్ధమవుతున్న సుమారు 1,54,737 మంది స్టూడెంట్స్ కోసం ఈ సమాచారం. ఉన్నత చదువుల్లో చేరడానికి ప్రభుత్వం త్వరలో ప్రవేశ ప్రకటనలు విడుదల చేయనుంది. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా విద్యార్థులు ముందస్తుగా తమ ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలి.
ఏయే పత్రాలు అవసరం?
ఇంటర్, డిగ్రీ లేదా ఇతర కోర్సుల్లో చేరడానికి ఈ క్రింది పత్రాలు తప్పనిసరి.
- ఆధార్ కార్డు , రేషన్ కార్డు: గుర్తింపు కోసం అవసరం.
- కులం , ఆదాయ ధ్రువపత్రాలు: మీసేవ కేంద్రాల ద్వారా వీటిని దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ కుటుంబంలో ఎవరికీ కుల ధ్రువీకరణ పత్రం లేకపోతే, లాయర్ ద్వారా అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
- బోనఫైడ్ : 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన పాఠశాలల నుండి వీటిని సేకరించాలి.
- నివాస ధ్రువీకరణ పత్రం: విద్యార్థి స్థానికతను నిరూపించడానికి ఇది అవసరం.
గ్యాప్ సర్టిఫికేట్ గురించి..
చదువు మధ్యలో ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం విరామం వచ్చిన విద్యార్థులు తప్పనిసరిగా ‘గ్యాప్ సర్టిఫికేట్’ తీసుకోవాలి. దీని కోసం మీసేవలో దరఖాస్తు చేస్తే, స్థానిక పోలీసులు విచారణ జరిపి ఈ సర్టిఫికేట్ జారీ చేస్తారు.
జాతీయ స్థాయి ప్రవేశాలకు (OBC, EWS, Non-Creamy Layer)..
నీట్ (NEET), జేఈఈ (JEE), క్యాట్ (CAT) వంటి జాతీయ స్థాయి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ , నాన్-క్రిమీలేయర్ సర్టిఫికేట్లు అవసరం. వీటి కోసం పదో తరగతి మార్కుల పత్రం, పట్టాదారు పాస్ పుస్తకాల నకలు , అఫిడవిట్‌తో మీసేవలో దరఖాస్తు చేసుకోవచ్చు.
చివరి నిమిషంలో కార్యాలయాల చుట్టూ తిరగకుండా, విద్యార్థులు వెంటనే మీసేవ కేంద్రాలను సంప్రదించి తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.








