హోలీలోపు అభ్యర్థులను ప్రకటిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గురువారం మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిథిలో జరిగిన సమావేశంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. అలాగే హోలీ పండుగలోపు రాష్ట్రం నుంచి లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తన బలం, బలగం మల్కాజ్‌గిరి కార్యకర్తలు, నాయకులేనని అన్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గం అంటే సీఎం నియోజకవర్గమని, ఇక్కడ గెలుపు అభ్యర్థిది కాదని, ముఖ్యమంత్రిదని అన్నారు. అలాగే ఎన్నికల్లో గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిథిలో పార్టీ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఉదయం 7 గంటలకే బస్తీ బాట పట్టాలని, ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. మల్కాజిగిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతా అనుసరించాలని, ఈ ఎన్నికలు పార్టీతో పాటు తనకు ఎంతో ప్రతిష్ఠాత్మకమని, ప్రత్యేకమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని, ఆ బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ఈ రోజు తాను సీఎంగా ఉన్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి కార్యకర్తలదేనని, ఆనాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా.. కార్యకర్తలే తనను భుజాలపై మోసి, గెలిపించి ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని గుర్తు చేసుకుంటూ.. ‘‘విధానసభ ఎన్నికల్లో రాష్ట్రమంతా గెలుపు సాధించినా.. మల్కాజిగిరి పార్లమెంట్ పరిథిలో ఆశించిన స్థాయిలో గెలవలేకపోయాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలైనా గెలిస్తే అభివృద్ధి చేసుకోవడానికి వీలుండేది. అందుకే ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా కచ్చితంగా ఎగరాలి. అప్పుడే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలం.’’ అని సీఎం పేర్కొన్నారు. ఆ బాధ్యత, నిబద్ధత మల్కాజ్‌గిరి కార్యకర్తలదేనని పిలుపునిచ్చారు.