ప్రవాస భారతీయుల రక్షణకు చర్యలు తీసుకోండి
అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ లేదా సుష్మా స్వరాజ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం అమెరికా వెళ్ళాలని ఆయన ఆ లేఖలో కోరారు. తద్వారా ప్రవాస భారతీయుల్లో నెలకొన్న అభద్రతా భావం తొలగిపోతుందని ఆయన పేర్కొన్నారు. మన దేశ ప్రజల రక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తాము అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. ఇటీవల అమెరికాలో కన్సాస్‌లో జరిగిన జాత్యాంహకార కాల్పులతో తెలుగు ఇంజనీర్లు కూచిబొట్ల శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడని, అలోక్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడని, దీంతో అమెరికాలోని మన దేశీయులు అభద్రతా భవాంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు.








