కెనడాలో వాజ్పేయి జీవితకథ ఆవిష్కరణ
భారతరత్న పురస్కార గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయూ ప్రపంచం మెచ్చిన మేధావి అని కెనడాలోని టొరొంటోలోని భారత దౌత్యాధికారి దినేష్ భాటియా అన్నారు. ప్రఖ్యాత జర్నలిస్టు విజయ్ త్రివేది రచించిన హిందీ గ్రంథం హర్ నహీ మానూంగా (వాజ్ పేయి జీవితకథ)ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగులోకి అనువదించిన ఓటమిని అంగీకరించను గ్రంథాన్ని మే 2న ఆవిష్కరించారు.
భారత దౌత్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి కెనడాలోని తెలుగు ప్రముఖులు వెలువోలు బసవయ్య , వీరెళ్ళ రాజేశ్వరరావుకు ప్రతులను అందజేశారు. యార్లగడ్డ మంచి గ్రంథాలను ఇరు భాషలలోకి అనువదిస్తూ జాతీయ సమైక్యతకు కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు. యార్లగడ్డ ప్రసంగిస్తూ ఐక్యరాజ్యసమితిలో విదేశాంగ మంత్రిగా హిందీలో ప్రసంగించిన తొలివ్యక్తి అటల్ బిహారి వాజ్పేయి అని, ఆయన ఐక్యరాజ్యసమితిలో హిందీని అధికారభాషగా గుర్తించాలని కలలు కన్నారని అన్నారు. తనను పండిట్ విద్యానివాస్ మిశ్రాను ఉపసమితి సభ్యులుగా నియమించారని, ఆరుగురు ప్రధాన మంత్రులు కేంద్రీయ హిందీ సమితికి అధ్యక్షులుగా ఉన్న సందర్భాలలో వారితో కలసి ఆ సమితి సభ్యుడిగా హిందీకి సేవ చేసే అవకాశం కల్గడం తనకు గౌరవంగా భావిస్తానని యార్లగడ్డ చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ భారతీయ సంఘాలు, హిందూ దేవాలయాల ప్రతినిధులు, తెలుగు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు ప్రవాసాంధ్రులు సూర్య బెజవాడ, సూరపనేని లక్ష్మీ నారాయణ, సామంతపూడి చారి, మండా జగదీష్, కొమరవోలు రావు, సరోజ తదితరులు పాల్గొన్నారు.








