బ్రాహ్మణ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : చంద్రబాబు
బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గడిచిన మూడేళ్ళలో వారి సంక్షేమానికి రూ.200 కోట్లు కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఏపీ బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యదర్శి డాక్టర్ చిట్టిబొట్ల భరద్వాజ శర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు పచ్చకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేద బ్రాహ్మణ యువత చదువుకు గాయత్రి, భారతి పథకాలను, నైపుణ్యాభివృద్ధికి వశిష్ట, ద్రోణాచార్య పథకాలను ప్రవేశపెట్టామన్నారు. వీటితో పాటు కశ్వప, గరుడ తదితర పథకాలతో బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. అగ్రవర్ణాల పేదలను కూడా ఆదుకుంటామని తన పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు అన్ని చర్యలు చేపడుతామని చెప్పారు. గత 70 ఏళ్ళలో బ్రాహ్మణ సంక్షేమానికి ఇంతగా కృషి చేసిన నాయకుడు, పార్టీ కూడా లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాహ్మణ బంధువు అని భరద్వాజ శర్మ కొనియాడారు.








