విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లోని 13వ షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాజధాని అమరావతికి మరింత విమాన అనుసంధానం ఏర్పడనుంది. ప్రపంచదేశాల నుంచి నేరుగా రాకపోకలు సాగించడానికి వీలుకలుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇక్కడ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించడంవల్ల పోటీ పెరిగి తక్కువ ధరకే సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకం వృద్ధి చెందనుంది. అంతర్జాతీయ ప్రయాణికులు, కార్గో ట్రాఫిక్ పెరగడం ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థికాభివృద్ధికి బాటలు పరుస్తుందని కేంద్రం పేర్కొంది.








