కదలని ‘ప్లానింగ్’!
పట్టణ ప్రణాళికా విభాగం సమస్యలతో సతమతమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాల్లోని భూములు, స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ విభాగంలో కంప్యూటరీకరించడంలో అలసత్వంతో సాఫ్ట్‌వేర్‌లో ప్లాన్ అనుమతులు సకాలంలో రాక రాష్ట్ర వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. 13 జిల్లాల్లో దాదాపు 1687 దరఖాస్తులు స్తంభించినట్టు తెలుస్తోంది. కార్యకలాపాలు మందగించడంతో ఆదాయం కూడా స్తంభించింది. దీంతో ఈ విభాగంలో ఆదాయ లక్ష్యానికి దూరంగా ప్రణాళిక సాగుతోందని, పురోగతి కనిపించడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూముల సబ్ డివిజన్ రికార్డులు వరకూ పరిమితమయ్యింది. క్షేత్ర స్థాయిలో సబ్ డివిజన్ జరిగిన రికార్డులు ప్రణాళికా విభాగంలో అందుబాటులో లేకపోవడంతో ఆ సమాచారాన్ని నిక్షిప్తం చేయలేకపోయారు. దీంతో ప్లాన్ అప్రూవల్స్కు ప్రతిబంధకంగా మారింది. ఆన్లైన్లో ప్లాన్ అనుమతులు ఇవ్వడంలేదు. ఆన్లైన్ సమస్యలు అధిగమించాలంటే ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌కు అనుబంధ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేయాలని బిల్డర్లు సూచిస్తున్నారు. అనుసంధానం కాని క్షేత్రస్థాయి రికార్డుల కారణంగా పట్టణ ప్రణాళికా విభాగంలో సాఫ్ట్వేర్ చిక్కుముడులు ఎదురయ్యి ప్రణాళికాబద్ద అభివృద్ధి అంగుళం కూడా ముందుకు జరగడంలేదని తెలుస్తోంది. గత ఏడాదికాలంలో లే అవట్లు, ఇంటిప్లాన్లు సకాలంలో మంజూరుకాక నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలు స్తంభించాయి. అసలే పెద్దనోట్ల రద్దుతో కుదేలైన ఈ రంగాలు ఇప్పుడు సాఫ్ట్వేర్ చిక్కులతో సతమతమవుతున్నాయి.








