టీటీడీ సంచలన నిర్ణయం
వేసవి సెలవుల తర్వాత కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో జులై 7 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో దివ్వదర్శనం (కాలినడక) టోకెన్లు రద్దు చేస్తున్నట్లు తిరుమల జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసే నడకదారి భక్తుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. సాధారణంగా గరుడసేవ, వైకుంఠ ఏకాదశి లాంటి ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రమే 50వేల మందికిపైగా భక్తులు నడకదారిలో వస్తుంటారని చెప్పారు. అయితే సాధారణ రోజుల్లోనూ 35వేల మందికి పైగా కాలినడకన వస్తున్నారన్నారు. దీంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోందని చెప్పారు. ఈ క్రమంలో ప్రయోగాత్మకంగా జులై 7 నుంచి శుక్ర, శని ఆదివారాల్లో దివ్వదర్శనం టోకెన్లు రద్దు చేస్తున్నామన్నారు. అలాగే లడ్డూ టోకెన్లు కూడా ఇవ్వబోమన్నారు. కొన్ని రోజులు పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాలినకడ భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








