గోవిందా…గోవిందా! కాలిబాట దివ్యదర్శనం రద్దు
శ్రీవారి కాలిబాట దివ్యదర్శనాన్ని రద్దు చేయడానికి రంగం సిద్ధం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ముందుగా రద్దీ రోజుల్లో కాలిబాట దర్శనాన్ని రద్దుచేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో తొలగించాలని భావిస్తున్నారు అధికారులు. కాలిబాటల్లో నడిచి తిరుమలకు చేరుకుని, నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు చాంతాడంత క్యూలైన్లలో వేచి ఉంటూ అవస్థలు పడుతున్నారు. కాలిబాటల్లో వచ్చిన తమను గాలికొదిలేస్తారా.. అంటూ టీటీడీ అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని గుర్తించారు టీటీడీ అధికారులు. కాలిబాట, సర్వదర్శనం, రూ.300 టికెట్ల దర్శనాలు ఏకకాలంలో అమలు చేయడంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో రద్దీ ఉండే రోజుల్లో అంటే.. శుక్ర, శని, ఆదివారాల్లో కాలిబాట దర్శనాన్ని రద్దు చేయాలనియని భావిస్తున్నారు టీటీడీ అధికారులు. కొద్దిరోజుల తరువాత పూర్తిస్థాయిలో కాలిబాట దర్శనాన్ని రద్దు చేయాలని యోచిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం.
లడ్డూల సరఫరాలో ఇక్కట్లు
టీటీడీపై శ్రీవారి లడ్డూల భారం ఏటా సుమారు రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకూ పడుతోందని లెక్కలు కట్టారు. శ్రీవారి ఆలయ పోటులో రోజూ మూడు లక్షల లడ్డూలు మాత్రమే తయారు చేసే అవకాశం ఉంది. ఒక రోజు కాలిబాటలో 50 వేల మంది భక్తులు నడిచివస్తే ఒక్కొక్కరికి ఐదు లడ్డూల చొప్పున 2.5 లక్షల లడ్డూలు సరఫరా చేయాల్సి ఉంది. ఇక సర్వదర్శనం, రూ.300 టికెట్ల దర్శనం, ఆర్జిత సేవల భక్తులకు లడ్డూల సరఫరాలో టీటీడీ తీవ్ర ఇబ్బంది పడుతోంది. అందువల్లే క్రమంగా కాలిబాట భక్తుల దర్శనానికి మంగళం పలికేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.








