Prakash Raj: ప్రకాష్ రాజ్ కు ఏపీ బిజేపి నేత షాక్..!
సినీ నటుడు ప్రకాష్‌రాజ్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీ(TTD) బోర్డు సభ్యుడు, బీజేపీ(BJP) నేత భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకాష్‌రాజ్‌కు లీగల్ నోటీసులు జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యాఖ్యల ద్వారా కోట్లాది మంది హిందువుల నమ్మకాలను ప్రకాష్‌రాజ్ ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని భానుప్రకాష్ రెడ్డి ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.
రామాయణానికి సంబంధించి ప్రకాష్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆక్షేపణీయమని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. హిందూ ధర్మంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రకాష్‌రాజ్‌కు అలవాటుగా మారిందని, ఇది ఇకపై సాగనివ్వబోమని హెచ్చరించారు. తన అనుచిత వ్యాఖ్యలకు గానూ ప్రకాష్‌రాజ్ తక్షణమే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రకాష్‌రాజ్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఏకంగా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని లీగల్ నోటీసుల్లో హెచ్చరించారు. ఇప్పటికే ఈ వివాదం సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతుండగా, టీటీడీ బోర్డు సభ్యుడు నేరుగా లీగల్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రకాష్‌రాజ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. సనాతన ధర్మాన్ని కించపరిచే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భానుప్రకాష్ రెడ్డి పునరుద్ఘాటించారు. మరి ఈ లీగల్ నోటీసులపై ప్రకాష్‌రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.








