ఏపీ బీచ్‌లకు పర్యాటక శోభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక శాఖ బీచ్ పర్యాటకాన్ని విస్తరిపంజేస్తోంది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా మూడు బీచ్ పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్యాకేజీలు చేపట్టింది. దీంతో పర్యాటకులకు కొత్తగా మూడు బీచ్‌లు ఏర్పడనున్నాయి. ఇటు నేలపైనా అటు నదిలోనూ ప్రయాణించే యాంపీబియాస్ (ఉభయ చర) బస్సులను పర్టాక శాఖ తొలిసారిగా గోదావరి నదిలో ప్రవేశపెడుతోంది. గోదావరి మహా పుష్కరాల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజక్టులో శరవేగంగా కదలిక వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేత డిసెంబర్ మాసంలో పలు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
బీచ్ టూరిజం ప్రాజెక్టుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక శాఖ కొత్తగా మూడు పర్యాటక బీచ్‌లను సిద్ధం చేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి. ఇందులో గోదావరి నదిపై రెండు వంతెనల నడుమ కొవ్వూరు వైపు రూ.8 కోట్ల అంచనా వ్యయంతో 9.50 ఎకరాల విస్తీర్ణంలో పర్యటక శాఖ కల్చరల్ సెంటర్‌ను నిర్మించనుంది. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు రూ.100 కోట్లు ప్రాధమికంగా విడుదల చేశారు. ఈ వంద కోట్ల నిధులకు సంబంధించి ఇప్పటి వరకు హేవలాక్ బ్రిడ్జి రాష్ట్రానికి దఖలు పర్చేందుకు రైల్వే శాఖకు రూ.13 కోట్లు, మొదటి విడత ప్యాకేజీ అభివృద్ధి రూ.25 కోట్లు, పిచ్చుకలంక పర్యాటక ప్రాజెక్టుకు రూ.18 కోట్లు, కొవ్వూరులో కల్చరల్ సెంటర్‌కు రూ.8 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కొవ్వూరులో గోదావరి నది ఒడ్డున సాంస్కృతిక కేంద్రాన్ని, రిసార్టుల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. మిగిలిన నిధులను కడియం నర్సరీ పర్యాటక ప్యాకేజీ, పోవలరం, సర్వసతి ఘాట్ బోటింగ్ పాయింట్లు నిర్మాణం, పూడిపల్లి వద్ద పర్యాటక ప్యాకేజీ, రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ వద్ద పర్యాటక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు కేటాయించారు. ఈ మొత్తం పనులన్నీ మార్చి నాటికి పూర్తి చేయాలని సంకల్పించారు.
ఎస్యానాం, ఓడలరేవు, అంతర్యేది వద్ద మూడు బీచ్‌లను డిసెంబర్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక చేపట్టారు. మల్కిపురం మండలం చింతలమోరి బీచ్‌ను రూ.1.50 కోట్లతోనూ, ఓడలరేవులో రూ.1.50 కోట్లు, ఎస్ యానాంలో రూ.1.50 కోట్లతోనూ అభివృద్ధి చేస్తున్నట్లు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ప్రత్యేక అధికారి తెలిపారు.
గోదావరి నదిలో యాంపిబియాస్ బస్సులను (ఉభయచర బస్సులు) నిర్వహించనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా గూటాల వద్ద గోదావరి రేవు వద్ద యాంపీబియాస్ బస్ ర్యాంపు నిర్మాణం పూర్తయ్యింది. తూర్పు గోదావరి జిల్లా వైపు సరస్వతి ఘాట్‌లో పర్యాటకులను బస్సులో ఎక్కించుకుని గూటాల నుంచి నదిలోకి దిగి పురుషోత్తపట్నం వద్ద నది నుంచి రోడ్డుపైకి వచ్చి సీతానగరం మీదుగా తిరిగి రాజమహేంద్రవరం చేరుకునే విధంగా ప్యాకేజీ రూపకల్పన చేశారు.








